
Allianz SE: బజాజ్ గ్రూప్‌ను వీడిన అలియాంజ్.. జియోతో భారీ ఒప్పందానికి రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీలోని ప్రముఖ బీమా సంస్థ అలియాంజ్ ఎస్‌ఈ (Allianz SE), ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల బజాజ్ గ్రూప్‌తో 24 ఏళ్ల భాగస్వామ్యాన్ని ముగించిన ఈ సంస్థ, తాజగా జియోతో కలిసి పని చేయాలని చూస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ భాగస్వామ్యం ఖరారైతే భారత బీమా రంగంలో అలియాంజ్‌కి ఇది రెండో జాయింట్ వెంచర్ కానుంది.
Details
రెండున్నర దశాబ్దాల భాగస్వామ్యానికి ముగింపు
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో తనకు ఉన్న 26 శాతం వాటాను 2.8 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు బజాజ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో ఇద్దరి మధ్య రెండున్నర దశాబ్దాల భాగస్వామ్యం ముగిసింది. అయితే జియో ఫైనాన్షియల్ యాజమాన్యంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)తో అలియాంజ్ గతకొంతకాలంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
బజాజ్‌తో విడిపోయే నిర్ణయం 2023 అక్టోబర్‌లోనే తీసుకున్న అలియాంజ్ అప్పటినుంచి జియోతో చర్చలను వేగవంతం చేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.