Amazon: అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon layoffs) ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈసారి కంపెనీ రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ చర్య వల్ల సుమారు 100 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు ప్రభావితమైనట్లు, ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ 'రాయిటర్స్' తన కథనంలో వెల్లడించింది. ఇదే ఏడాది జనవరిలో అమెజాన్ ఇప్పటికే 16వేల మంది ఉద్యోగులను తొలగించింది. అప్పట్లోనే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండొచ్చని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఆ ప్రకటనల కొనసాగింపుగానే ఇప్పుడు తాజా లేఆఫ్‌లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ తాజా చర్యలో భాగంగా, అమెజాన్ గోదాముల్లో జరిగే పనులను ఆటోమేషన్ ద్వారా నిర్వహించేందుకు రోబోలను రూపకల్పన చేసే టీమ్‌పై ఉద్యోగాల కోతలు విధించారు.
వివరాలు
బ్లూ జే' పేరుతో రోబోలను ప్రదర్శించిన అమెజాన్ రోబోటిక్స్ విభాగం
కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తమ బృందాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్పులు చేపడుతుంటామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎంతమందిని తొలగించారనే స్పష్టమైన సంఖ్యను వెల్లడించకపోయినా, లేఆఫ్‌లు జరిగిన విషయం మాత్రం కంపెనీ ధ్రువీకరించింది. వేర్‌హౌస్‌లలో పనిచేసే కార్మికులకు సహాయం చేసే ఉద్దేశంతో అమెజాన్ రోబోటిక్స్ విభాగం 'బ్లూ జే' పేరుతో గతేడాది అక్టోబర్‌లో కొన్ని రోబోలను ప్రదర్శించింది.
వివరాలు
30 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్
కానీ ఈ ప్రాజెక్టు ఖర్చుతో కూడుకున్నదిగా మారడంతో, ఈ ఏడాది జనవరిలో ఆ రోబో తయారీ ప్రక్రియను నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, అలాగే ఖర్చులను తగ్గించే చర్యలలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో సుమారు 14వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది జనవరిలో మరో 16వేల మందిని తొలగించడంతో, మొత్తం కలిపి ఇప్పటివరకు 30 వేల మంది ఉద్యోగులను అమెజాన్ సంస్థ నుంచి తొలగించినట్లైంది.