Amazon Now: నిమిషాల్లోనే ఇంటికి సరకులు.. 100 నగరాలకు 'అమెజాన్ నౌ' విస్తరణ..3% పతనమైన Eternal,Swiggy షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ తన వేగవంతమైన సరఫరా విభాగం 'అమెజాన్ నౌ'ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు పరిమిత నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలోనే 100 నగరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. వినియోగదారులు ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సరుకులను ఇంటికే చేర్చే విధంగా ఈ సేవ పనిచేస్తోంది. ఈ విస్తరణలో భాగంగా సంస్థ తమ పంపిణీ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూ సుమారు రూ.2800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే ఉన్న నగరాలతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు కూడా సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దేశవ్యాప్తంగా 1000కు పైగా చిన్న సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అమెజాన్ ఇండియా తెలిపింది.
వివరాలు
వస్తువులు కొద్ది నిమిషాల్లోనే వినియోగదారులకు చేరేలా చర్యలు
ప్రస్తుతం ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, బెంగళూరులో మాత్రమే ఉన్న ఈ సేవలను త్వరలోనే హైదరాబాద్, విశాఖపట్నం, పుణె, చెన్నై, కోల్‌కతా, లఖ్‌నవూ, కాన్పూర్, ఛండీగఢ్, అహ్మదాబాద్, మీరట్, మైసూర్, పానిపట్, కొచ్చి, అమృత్‌సర్, మంగళూరు వంటి నగరాలకు విస్తరించనుంది. తాజా పండ్లు, కూరగాయలు, కిరాణా సరుకులు మాత్రమే కాకుండా గృహ అవసరాల వస్తువులు, పిల్లల వినియోగ వస్తువులు కూడా కొద్ది నిమిషాల్లోనే వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకుంటోంది. అమెజాన్ ఇండియా ప్రతినిధి హర్ష్ గోయల్ మాట్లాడుతూ, వినియోగదారులు వేగం, సరసమైన ధరలు, విస్తృత ఎంపికతో పాటు రైతుల నుంచి నేరుగా అందే తాజా ఉత్పత్తుల నాణ్యతను మెచ్చుకుంటున్నారని తెలిపారు.
వివరాలు
అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే కేంద్రాలు
ఈ స్పందనతో ప్రోత్సాహం పొంది విస్తరణను మరింత వేగంగా అమలు చేస్తున్నామని చెప్పారు. వెయ్యికి పైగా చిన్న సరఫరా కేంద్రాల నెట్‌వర్క్‌తో ఈ సేవలను 100 నగరాలకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ విస్తరణ ద్వారా దేశవ్యాప్తంగా 16 వేల మందికిపైగా రైతులకు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసే అవకాశం లభించనుంది. దీంతో రైతులకు మెరుగైన ఆదాయం, వినియోగదారులకు తాజా సరుకులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే చిన్న సరఫరా కేంద్రాల ద్వారా నిర్వహించబడతాయి. ఇవి అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే కేంద్రాలు కాగా, స్థానిక అవసరాలను గుర్తించి సరుకులను ముందుగానే సమీప ప్రాంతాల్లో నిల్వ ఉంచుతాయి. దీంతో వినియోగదారులకు అత్యంత వేగంగా సరఫరా అందించగలుగుతున్నాయి.
వివరాలు
3% పతనమైన Eternal, Swiggy షేర్లు
అమెజాన్ తన 'Amazon Now' అనే క్విక్ కామర్స్ సేవను భారతదేశవ్యాప్తంగా 100 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించడంతో.. ఈ విభాగంలో పోటీ మరింత తీవ్రమైంది. దీని ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్'లో Eternal, Swiggy సంస్థల షేర్లు 3 శాతం వరకు పడిపోయాయి.