Jio Financial Services: బీమా రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్.. జేవీ ఏర్పాటకు జియో యత్నాలు..!
రిలయెన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసులు త్వరలో బీమా రంగంలో జాయింట్ వెంచర్ (JV) ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో, జర్మనీకి చెందిన అలియాంజ్ ఎస్‌ఈతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అలియాంజ్ ఇప్పటికే భారత్‌లో ఉన్న తన రెండు జాయింట్ వెంచర్లను రద్దు చేయాలని చూస్తోంది. ఇప్పుడు, జియో, అలియాంజ్ కలిసి జనరల్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ రంగంలో సేవలను అందించేందుకు జేవీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. దీనిపై జియో ఫైనాన్షియల్స్ ప్రతినిధి మాట్లాడుతూ, "మేము ఊహాగానాలపై స్పందించము. పరిణామాల్లో ఎలాంటి పురోగతి జరిగినప్పుడు, అది నిబంధనల ప్రకారం అధికారికంగా వెల్లడిస్తాము" అని అన్నారు.
భారత్‌లో బీమా రంగం వేగంగా అభివృద్ధి
అయితే అలియాంజ్ నుండి ఈ విషయంపై ఎటువంటి స్పందన రాలేదు. అలియాంజ్ సంస్థ,మ్యూనిచ్ కేంద్రంగా పని చేస్తూ,భారత్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్‌తో కలిసి ఉంది. కానీ, బజాజ్ ఆ భాగస్వామ్యం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ,భారత్ మార్కెట్లో కొనసాగుతామని అలియాంజ్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి, జియో ఫైనాన్షియల్ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్ కె.వి.కామత్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ బ్రోకరేజీ రంగాల్లో విశేష అనుభవం ఉంది. భారత్‌లో బీమా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశంలో బీమా వినియోగం,జీడీపీతో పోల్చిన ప్రీమియం నిష్పత్తి దక్షిణాఫ్రికా,కెనడాతో పోలిస్తే తక్కువగా ఉంది. అయితే,భవిష్యత్తులో ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.