Amul: ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్‌గా అమూల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్‌గా అమూల్ గుర్తింపు పొందింది. బ్రాండ్ విలువను అంచనా వేసే సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే అమూల్ బ్రాండ్ విలువ ఏకంగా 22శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన 'ఫుడ్ & డ్రింక్స్ 2026' నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 100 ఫుడ్ బ్రాండ్ల జాబితాలో అమూల్ 13వ స్థానాన్ని దక్కించుకుంది. అమూల్ బ్రాండ్ బలం కూడా గణనీయంగా ఉంది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ (BSI)లో 100కి 93 పాయింట్లు సాధించింది. అలాగే AAA+ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్‌గా అమూల్ నిలిచింది.
వివరాలు
ఫుడ్ టాప్ 10 ర్యాంకింగ్స్‌లోకి నందిని
మరోవైపు భారతీయ ఆహార, డెయిరీ బ్రాండ్లు కూడా ఈ జాబితాలో మంచి ప్రదర్శన కనబరిచాయి. మదర్ డెయిరీ, బ్రిటానియా బ్రాండ్ విలువలు రెండంకెల స్థాయిలో పెరిగాయి.
కర్ణాటకకు చెందిన డెయిరీ బ్రాండ్ నందిని కూడా ప్రపంచ టాప్ ఫుడ్ బ్రాండ్లలో చోటు దక్కించుకుంది.
1.1 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఫుడ్ టాప్ 100 జాబితాలోకి ప్రవేశించింది. మదర్ డెయిరీ 60వ స్థానానికి చేరుకుంది.
ఏడాదిలో ఆ సంస్థ బ్రాండ్ విలువ 22 శాతం పెరిగి 1.4 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రిటానియా 63వ స్థానంలో నిలిచింది.
దాని బ్రాండ్ విలువ 17 శాతం పెరిగి 1.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంస్థకు AAA- రేటింగ్ లభించింది.
వివరాలు
అగ్రస్థానంలో అత్యంత విలువైన ఫుడ్ బ్రాండ్‌గా నెస్లే
ప్రపంచంలో అత్యంత విలువైన ఫుడ్ బ్రాండ్‌గా నెస్లే తన అగ్రస్థానాన్ని కొనసాగించింది.
ఏడాదిలో దాని బ్రాండ్ విలువ 23 శాతం పెరిగి 24.6 బిలియన్ డాలర్లకు చేరింది.
మరోవైపు కోకా-కోలా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ బ్రాండ్‌గా కొనసాగింది.
అయితే దాని బ్రాండ్ విలువ 1 శాతం తగ్గి 46.1 బిలియన్ డాలర్లకు చేరింది.
చైనాకు చెందిన ఆసియాలో అతిపెద్ద డెయిరీ సంస్థ యిల్లీ (Yili) అత్యంత విలువైన నాన్-ఆల్కహాలిక్ డెయిరీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.
ఏడాదిలో దాని బ్రాండ్ విలువ 29 శాతం పెరిగి 14.5 బిలియన్ డాలర్లకు చేరింది.