
Anant Ambani: 'అనంత్‌కు భగవంతుడి ఆశీర్వాదం అవసరం'.. నీతా అంబానీ భావోద్వేగం
ఈ వార్తాకథనం ఏంటి
రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్ నుంచి శ్రీకృష్ణుడి దివ్య క్షేత్రమైన ద్వారకకు (Dwarka) పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆదివారం ద్వారకకు చేరుకొని శ్రీకృష్ణుని దర్శించుకోవడంతో ఆయన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని తల్లి నీతా అంబానీ, జీవిత భాగస్వామి రాధికా మర్చంట్‌తో కలిసి అనంత్ పవిత్ర పూజలు నిర్వహించారు.
ఈ యాత్రలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నీతా అంబానీ స్పందిస్తూ... తన కుమారుడు పది రోజులపాటు పాదయాత్ర చేసి ద్వారక చేరడం తల్లిగా ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
Details
మార్చి 29న జామ్ నగర్ లో యాత్ర ప్రారంభం
పాదయాత్రలో పాల్గొన్న యువత దేశ సంస్కృతిని ప్రచారం చేయడంలో భాగస్వాములవుతున్నారని ఆమె కొనియాడారు.
తన కుమారుడు అనంత్‌కు భగవంతుడు మరింత బలం, ఆధ్యాత్మికశక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ పాదయాత్రను అనంత్ మార్చి 29న జామ్‌నగర్‌లో ప్రారంభించారు.
మొత్తం 170 కిలోమీటర్ల దూరాన్ని ఆయన రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడుస్తూ పూర్తిచేశారు. ప్రతిరోజూ రాత్రివేళలలో సుమారు ఏడు గంటలపాటు నడిచి, మార్గమధ్యంలో ప్రజలతో మమేకమయ్యారు.
ఈ యాత్రలో పలువురు స్థానికులు కూడా ఆయనకు సంఘీభావంగా తోడయ్యారు.
యాత్ర సందర్భంగా హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రాలు పారాయణం చేస్తూ ఆధ్యాత్మికతను నింపుతూ అనంత్ అంబానీ తన పాదయాత్రను భక్తిశ్రద్ధలతో ముగించారు.