LOADING...
Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. అనిల్‌ అంబానీ ఇల్లు 'అబోడ్' అటాచ్  
మనీలాండరింగ్‌ కేసు.. అనిల్‌ అంబానీ ఇల్లు 'అబోడ్' అటాచ్

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. అనిల్‌ అంబానీ ఇల్లు 'అబోడ్' అటాచ్  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ముంబైలోని 17 అంతస్తుల లగ్జరీ నివాసం 'అబోడ్'ను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఈ 66 మీటర్ల ఎత్తైన భవనం విలువ సుమారు రూ.3,716.83 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరింది.

వివరాలు 

రూ.3,000కోట్ల రుణాలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్టు అనుమానాలు

ఇప్పటికే ఒకసారి ఆగస్టు 2025లో ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీని మరోసారి ఢిల్లీలో విచారణకు పిలిచే అవకాశముంది. ఇదే సమయంలో సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై మోసం,లంచాలు,ప్రజా నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీల్లో 35కిపైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ,50కిపైగా కంపెనీలకు చెందిన 25 మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించినట్టు సమాచారం. 2017 నుంచి 2019 మధ్య యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న సుమారు రూ.3,000కోట్ల రుణాలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల ఆమోద ప్రక్రియలో అవకతవకలు, ముందస్తు చెల్లింపులు, బ్యాక్‌డేటెడ్ ఆమోద పత్రాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు 

సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్న ఎస్బీఐ

యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు సంబంధించిన సంస్థలకు రుణాల విడుదలకు ముందు నిధులు చేరాయా అనే అంశంపైనా విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంపై నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబి, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు ఇచ్చిన సమాచారం కూడా ఈడీ దర్యాప్తుకు దోహదపడినట్టు తెలుస్తోంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో కార్పొరేట్ రుణాలు ఒక్కసారిగా పెరగడంపై సెబి సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్,అనిల్ అంబానీని 'ఫ్రాడ్'గా ప్రకటించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న ఎస్బీఐ, సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

వివరాలు 

దివాలా ప్రక్రియలో RCOM నేషనల్ కంపెనీ

ప్రస్తుతం RCOM నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు దివాలా ప్రక్రియలో ఉంది. ఇదే సమయంలో అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా ప్రక్రియ కూడా ప్రారంభించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌లో వెల్లడించారు. అయితే రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. RCOM, RHFL వ్యవహారాలు తమ నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపవని ప్రకటించాయి. మొత్తంగా 'అబోడ్' అటాచ్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కార్పొరేట్ కేసు కొత్త దశలోకి ప్రవేశించింది.

Advertisement