Loading...
Anthropic IPO: ఆంత్రోపిక్ ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా? భారతీయ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే!
భారతీయ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే!

Anthropic IPO: ఆంత్రోపిక్ ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా? భారతీయ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న ఆంత్రోపిక్ (Anthropic) కంపెనీ ఐపీఓపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా భారతీయ ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఎన్విడియా (Nvidia) వంటి ఏఐ కంపెనీలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కోల్పోయిన వారు.. ఇప్పుడు ఆంత్రోపిక్‌పై దృష్టి సారిస్తున్నారు. అయితే భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఐపీఓ ఆఫర్ ధరకు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. భారత్ ఈ ఐపీఓ రిటైల్ ఆఫరింగ్ పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం.

వివరాలు 

భారతీయులు ఆంత్రోపిక్ షేర్లను ఎలా కొనుగోలు చేయవచ్చు?

అయితే నాస్‌డాక్ (Nasdaq)లో ఆంత్రోపిక్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత భారతీయులు అంతర్జాతీయ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తున్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద భారతీయ నివాసితులు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.

ఇందుకోసం అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవాలి.

అయితే పెట్టుబడి పెట్టే ముందు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పన్నులు, విదేశీ మారకపు నిబంధనలు, లావాదేవీల ఛార్జీలు, ఇతర ఖర్చుల గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం.

వివరాలు 

ఆంత్రోపిక్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా?

2021లో మాజీ ఓపెన్‌ఏఐ (OpenAI) పరిశోధకులు స్థాపించిన ఆంత్రోపిక్.. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.

ఈ కంపెనీ రూపొందించిన క్లాడ్ (Claude) చాట్‌బాట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.

చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ జెమినీ (Google Gemini) వంటి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.

సబ్‌స్క్రిప్షన్లు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ఒప్పందాలు, వ్యాపార సంస్థలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు అందించే ఏఐ సేవల ద్వారా ఆంత్రోపిక్ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

అంతేకాకుండా అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల మద్దతు కూడా ఈ కంపెనీకి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఆంత్రోపిక్ వృద్ధికి ఏఐ డిమాండ్ ఎంతవరకు దోహదపడుతుంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

అనేక కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ టూల్స్‌పై భారీగా ఖర్చు చేస్తున్నాయి.

ఈ పరిణామాలు ఆంత్రోపిక్ ఆదాయ వృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తులో ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చినట్లుగానే ఏఐ కూడా అన్ని రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందని భావించే పెట్టుబడిదారులకు ఆంత్రోపిక్ దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా క్లాడ్ వంటి ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల నుంచి లభిస్తున్న మద్దతు కంపెనీ భవిష్యత్తు వృద్ధికి సానుకూల అంశాలుగా మారవచ్చు.

అయితే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని భావించేవారు కొన్ని ముఖ్యమైన రిస్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు 

ఆంత్రోపిక్‌లో పెట్టుబడికి ప్రధాన రిస్కులివే..

1. భారీ వాల్యుయేషన్: ఆంత్రోపిక్ కంపెనీ విలువ సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో కంపెనీపై పెట్టుబడిదారుల అంచనాలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంత భారీ విలువకు తగ్గట్టుగా భవిష్యత్తులో కంపెనీ వృద్ధి సాధించలేకపోతే షేరు ధర గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అధిక వాల్యుయేషన్ వద్ద పెట్టుబడి పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలి.

2. భారీ నిర్వహణ ఖర్చులు: ఏఐ సేవలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం సాధారణ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఇందుకోసం అత్యాధునిక చిప్స్, భారీ డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. వీటిని ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి ఆంత్రోపిక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.

వివరాలు 

ఆంత్రోపిక్‌లో పెట్టుబడికి ప్రధాన రిస్కులివే..

భవిష్యత్తులో ఏఐ సేవలకు డిమాండ్ తగ్గితే ఈ భారీ పెట్టుబడులు కంపెనీకి ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది.

3. తీవ్రమైన పోటీ: ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం ఓపెన్‌ఏఐ, గూగుల్, మెటా వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీలు, మెరుగైన ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం ఈ సంస్థలు నిరంతరం పోటీపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీలు మరో ఐదేళ్ల తర్వాత కూడా అదే స్థానాన్ని కొనసాగిస్తాయని చెప్పలేం. పోటీ కారణంగా ఆంత్రోపిక్ మార్కెట్ వాటా, ఆదాయ వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు 

ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు ఏం చేయాలి?

ఆంత్రోపిక్ ఐపీఓ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ.. కేవలం కంపెనీ పేరు, ఏఐ రంగంపై ఉన్న క్రేజ్‌ను చూసి పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు.

ముఖ్యంగా భారీ వాల్యుయేషన్‌తో మార్కెట్లోకి వచ్చే కంపెనీల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు కలిగి ఉండి, అధిక రిస్క్‌ను భరించే సామర్థ్యం ఉన్నవారు కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా దశలవారీగా పెట్టుబడులు పెట్టే విధానాన్ని పరిశీలించవచ్చు.

షేర్లు మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి రోజే తొందరపడి కొనుగోలు చేయడం కంటే.. కొంతకాలం కంపెనీ పనితీరు, షేరు ధరల్లో వచ్చే మార్పులు, ఆర్థిక ఫలితాలను గమనించడం మంచిది.

వివరాలు 

ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు ఏం చేయాలి?

ప్రపంచ ఏఐ రంగంలో ఆంత్రోపిక్ కీలక సంస్థగా ఎదుగుతున్నప్పటికీ.. ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులకు లాభాల అవకాశాలతో పాటు గణనీయమైన రిస్కులు కూడా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత షేరు విలువ, భవిష్యత్తు వృద్ధి అవకాశాలను క్షుణ్ణంగా విశ్లేషించాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.

గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు.

ADVERTISEMENT