Anthropic IPO: ఆంత్రోపిక్ ఐపీఓలో రికార్డు.. ఏకంగా 107.3 బిలియన్ డాలర్ల సమీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) సంచలనం సృష్టించింది. తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO),ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఏకంగా 107.3బిలియన్ డాలర్లు (సుమారు రూ.9.9లక్షల కోట్లు) సమీకరించింది. ఈ ఘనతతో స్టాక్ మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించిన తొలి ప్రముఖ ఏఐ సంస్థగా ఆంథ్రోపిక్ నిలిచింది. ఈ ఐపీఓలో భాగంగా ఒక్కో షేరును 83డాలర్లకు విక్రయించింది.తొలుత ఒక్కో షేరు ధరను 70 నుంచి 78డాలర్ల మధ్య నిర్ణయించాలని భావించినప్పటికీ.. భారీ డిమాండ్ కారణంగా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఈ ఆఫరింగ్‌లో భాగంగా 956.4మిలియన్ల షేర్లను విక్రయించింది. వీటితోపాటు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్,మైక్రోసాఫ్ట్ సహా పలు సంస్థల నుంచి 26బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులను కూడా సమీకరించింది.
వివరాలు
స్పేస్ఎక్స్ రికార్డును అధిగమించిన ఆంథ్రోపిక్ ఐపీఓ
ఐపీఓలో షేరు ధర అంచనాలకు మించి నిర్ణయించడంతో ఆంథ్రోపిక్ మొత్తం విలువ సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌ను పక్కనపెట్టినా.. ఈ ఐపీఓ ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్గా నిలిచింది.
గతంలో స్పేస్ఎక్స్ నెలకొల్పిన 75 బిలియన్ డాలర్ల రికార్డును అధిగమించింది. ఏఐ రంగానికి ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
ఇప్పటివరకు చిప్ తయారీ సంస్థలు, ఏఐ మౌలిక సదుపాయాలను అందించే కంపెనీలపైనే పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టేవారు.
అయితే ఇప్పుడు వ్యాపారాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు, వైద్య రంగంలోనూ ఏఐ కీలకంగా మారుతుండటంతో ఆంథ్రోపిక్ వంటి సంస్థలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.
వివరాలు
ఆంథ్రోపిక్ ఐపీఓకు ఏడు రెట్లు అధిక స్పందన
ఆంథ్రోపిక్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
అందుబాటులో ఉన్న షేర్ల కంటే దాదాపు ఏడు రెట్లు అధికంగా కొనుగోలు ఆర్డర్లు వచ్చాయి.
వాల్‌స్ట్రీట్ నుంచి లండన్, టోక్యో వరకు పలువురు పెట్టుబడిదారులు ఈ షేర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపారు.
గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఈ షేర్లు నాస్డాక్ 100 వంటి సూచీల్లో చోటు సంపాదించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే ఐపీఓలో తమకు కేటాయించిన షేర్లలో కొంత భాగాన్ని ఇతర ఆసక్తిగల పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు కొందరు ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తున్నారు.
వివరాలు
అంచనాల కంటే తక్కువ విలువ.. అయినా భారీ విజయమే!
ఆంథ్రోపిక్ ఐపీఓతో ప్రపంచంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద 15 పబ్లిక్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది.
టెస్లా కంపెనీతో దాదాపు సమాన స్థాయికి చేరుకుంది. కొన్ని నెలల క్రితం ఈ సంస్థ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు వెలువడ్డాయి.
అయితే తాజా ఐపీఓతో కంపెనీ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఇటీవల టెక్నాలజీ షేర్ల ధరలు తగ్గిన సమయంలో వాల్‌స్ట్రీట్‌లో కొందరు విశ్లేషకులు అంచనా వేసిన 1.1 ట్రిలియన్ డాలర్ల కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.
ఈ పరిణామంతో ప్రత్యర్థి సంస్థ ఓపెన్ఏఐ కంటే ఆంథ్రోపిక్ ముందంజలో నిలిచింది. కాగా, ఓపెన్ఏఐ 2027 కంటే ముందు స్టాక్ మార్కెట్లోకి వచ్చే ఆలోచనలో లేదని సమాచారం.
వివరాలు
ఆంథ్రోపిక్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులకు భారీ లాభాలు
ఆంథ్రోపిక్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కావడంతో సంస్థ సహ వ్యవస్థాపకులు, ఉద్యోగుల వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా సంస్థ సీఈఓ డారియో అమోడెయ్తో పాటు ఇతర సహ వ్యవస్థాపకులకు ఈ ఐపీఓ ద్వారా భారీ ప్రయోజనం చేకూరనుంది.
అలాగే ఐకానిక్, కోట్యూ మేనేజ్మెంట్, స్పార్క్ క్యాపిటల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలకు కూడా మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఐపీఓ నిర్వహణలో గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ ప్రధాన బాధ్యతలు చేపట్టాయి.
వీటితోపాటు మరో 20 బ్యాంకులు కూడా పాల్గొన్నాయి. నాస్డాక్ గ్లోబల్ సెలెక్ట్ మార్కెట్లో ANT అనే ట్రేడింగ్ గుర్తుతో ఆంథ్రోపిక్ షేర్లు లావాదేవీలు జరపనున్నాయి.