Anthropic IPO: ఐపీఓకు ముందే ఆంత్రోపిక్ షాక్.. 69.3 బిలియన్ డాలర్ల వివరాలు రీకాల్
ఈ వార్తాకథనం ఏంటి
క్లాడ్ ఏఐని రూపొందించిన అమెరికా స్టార్టప్ ఆంత్రోపిక్ ప్రతిపాదిత ఐపీఓపై ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కంపెనీ ఏకంగా 69.3 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు సిద్ధమవుతోందంటూ బ్యాంకర్లకు వివరాలు పంపింది. అయితే కొద్దిసేపటికే ఆ సమాచారాన్ని వెనక్కి తీసుకుంది. షేర్ ధరకు సంబంధించిన వివరాలు తప్పుగా ఉన్నాయని, సవరించిన సమాచారాన్ని తర్వాత ఫైలింగ్‌లో అందిస్తామని బ్యాంకులకు పంపిన మరో ఇమెయిల్‌లో తెలిపింది. దీంతో ఇప్పటికే భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లలో ఈ వ్యవహారం ఆసక్తిని రేకెత్తించింది. ఆంత్రోపిక్ ఐపీఓ ప్రపంచ టెక్ మార్కెట్లోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్గా మారుతుందా అనే చర్చ కూడా మొదలైంది.
Details
ఒక్కో షేర్ ధర ఎంతంటే?
మొదట పంపిన ఫైలింగ్‌లో ఆంత్రోపిక్ సుమారు 867 మిలియన్ షేర్లను విక్రయించనున్నట్లు పేర్కొంది.
ఒక్కో షేర్ ధరను 70 నుంచి 80 డాలర్ల మధ్యగా చూపించింది. ఈ లెక్కల ప్రకారం కంపెనీ భారీ మొత్తంలో నిధులు సమీకరించే అవకాశం కనిపించింది.
అయితే ధరకు సంబంధించిన సమాచారం కచ్చితంగా లేదని తర్వాత కంపెనీ స్పష్టం చేసింది. కొత్త గణాంకాలతో ఫైలింగ్‌ను అప్డేట్ చేస్తామని తెలిపింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఐపీఓ ప్రక్రియలో ఇలాంటి కీలక వివరాలు చివరి నిమిషంలో మారడం మార్కెట్ వర్గాల్లో సహజంగానే ఆసక్తిని పెంచింది.
Details
ఆంత్రోపిక్ విలువపై భారీ అంచనాలు
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఆంత్రోపిక్ విలువపై పెట్టుబడిదారుల్లో కొత్త చర్చ మొదలైంది.
కొందరు ఇన్వెస్టర్లు కంపెనీ విలువను 1.1 ట్రిలియన్ నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల మధ్యగా అంచనా వేస్తున్నట్లు సమాచారం.
అయితే గతంలో ఆంత్రోపిక్ తన విలువను 2 ట్రిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది.
ఏఐ కంపెనీల విలువలపై మార్కెట్లో వచ్చిన మార్పులు ఇప్పుడు ఆ అంచనాలపై ప్రభావం చూపుతున్నాయి.
అంటే ఐపీఓ పరిమాణం మాత్రమే కాదు, కంపెనీ మొత్తం మార్కెట్ విలువ విషయంలోనూ ఆంత్రోపిక్ కొత్త లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది.
Details
స్పేస్‌ఎక్స్‌ను మించే ఐపీఓ అవుతుందా?
2021లో ప్రారంభమైన ఆంత్రోపిక్ ఇప్పటివరకు వేగంగా ఎదిగిన ఏఐ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.
అందుకే ఈ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రణాళికలు అమలైతే ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఈ ఏడాది జూన్‌లో రికార్డు స్థాయిలో మార్కెట్లోకి వచ్చిన స్పేస్ఎక్స్ ఐపీఓను కూడా ఆంత్రోపిక్ అధిగమించవచ్చన్న చర్చ సాగుతోంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ కంపెనీల వాల్యుయేషన్లు మారుతున్న నేపథ్యంలో తుది ధర, షేర్ల సంఖ్య, మొత్తం విలువ ఎలా ఉంటాయనేది ఇంకా స్పష్టంగా లేదు.
అందుకే ఆంత్రోపిక్ తదుపరి ఫైలింగ్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు కీలకంగా మారింది.