AP Budget 2026: ప్రపంచ స్థాయి లక్ష్యంతో ముందుకు ఏపీ.. 26 కొత్త విధానాలకు శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లతో తీసుకున్న అప్పుల భారం తగ్గించేందుకు చేపట్టిన చర్యలను ప్రస్తావించారు.
Details
వడ్డీ భారం తగ్గింపు చర్యలు
గత ప్రభుత్వం వడ్డీ రేటుతో సంబంధం లేకుండా 12.3 శాతం వరకు కూడా రుణాలు తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి భారంగా మారిన ఆ రుణాలను 9 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ.43,298 కోట్ల రుణాలపై వడ్డీ తగ్గించి, సంవత్సరానికి రూ.327 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. అదనంగా రూ.1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, దీనివల్ల సంవత్సరానికి సుమారు రూ.1,658 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు.
Details
బకాయిల క్లియరెన్స్ & నిధుల విడుదల
పంచాయతీలు, మున్సిపాలిటీల బలోపేతానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ.3,797 కోట్లు విడుదల చేశారు. 12 జూన్ 2024 నాటికి పెండింగ్‌లో ఉన్న రూ.24,811 కోట్ల బకాయిలను క్లియర్ చేసినట్లు తెలిపారు. సాగునీరు, రహదారులు తదితర అభివృద్ధి పనుల కోసం రూ.37,030 కోట్లు చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించారు. 163 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.18,701 కోట్లు విడుదల చేసి, అందులో 85 పథకాలను మళ్లీ అమలులోకి తీసుకువచ్చారు. దీంతో కేంద్ర నిధుల విడుదల మరింత పెరిగిందని పేర్కొన్నారు. వెల్త్ ఫండ్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్‌ను రూ.100 కోట్ల సీడ్ కార్పస్‌తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.
Details
కూటమి ప్రభుత్వ సంస్కరణలు
పరిపాలన వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చిందని ఆర్థిక మంత్రి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' సిద్ధాంతానికి అనుగుణంగా చట్టాలు, నియమాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను సమీక్షిస్తూ పరిపాలనా సరళీకరణ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పౌర సేవల మెరుగుదలపై దృష్టి పెట్టారు. కేంద్ర విధానానికి అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలు TReDS డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా బిల్ డిస్కౌంటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
Details
భారీగా పెట్టుబడులు
స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (SASCI) కింద 2025-26లో ఫిబ్రవరి 12, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ రూ.6,544 కోట్లు పొందింది. మార్చి 31 నాటికి మరో రూ.1,438 కోట్లు అందుకోనుంది. ఇది 2023-24లో పొందిన రూ.4,090 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దేశంలో తొలిసారిగా 'రీ-ఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్' నిర్వహించడంతో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమమై, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఏర్పడ్డాయి.
Details
కొత్త విధానాలు
రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరించిన విధానాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. వాటిలో ముఖ్యమైనవి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం (4.0) ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ & పారిశ్రామిక వేత్తల అభివృద్ధి విధానం (4.0) ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ & స్టార్టప్ విధానం (4.0) ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం ఈ విధానాలు రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలమైన, స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా తీసుకెళ్తాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.