Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్‌కు ఈటీ 'ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్-మెగా' అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది నిర్వహించిన ఎకనమిక్ టైమ్స్ (ఈటీ) ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మకమైన 'ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ - మెగా' పురస్కారం లభించింది. దేశంలోని అతిపెద్ద కుటుంబ ఆధారిత సంస్థల్లో ఒకటిగా నిలిచిన అపోలో హాస్పిటల్స్.. వృద్ధి, సుస్థిర కార్పొరేట్ పాలన, అలాగే తరతరాల వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించడంలో చూపిన అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అపోలో హాస్పిటల్స్ ప్రస్థానం వ్యవస్థాపక ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దూరదృష్టితో ప్రారంభమైందని సంస్థ తెలిపింది.
వివరాలు
ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి
ప్రస్తుతం ఆయన కుమార్తెలైన ప్రీతా రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్), శోభనా కామినేని (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్), సునీతా రెడ్డి (మేనేజింగ్ డైరెక్టర్), సంగీతా రెడ్డి (సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్) సమష్టి నాయకత్వంలో సంస్థ విజయవంతంగా ముందుకు సాగుతోందని పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న తన కలను తన కుమార్తెలు సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
ప్రత్యేక దృక్పథంతో ఒక్కో కీలక విభాగానికి ఒక్కొక్కరు నాయకత్వం వహిస్తూ అపోలో హాస్పిటల్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. కుటుంబ సమష్టి నాయకత్వానికి దక్కిన గుర్తింపుగానే ఈ అవార్డును భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.