Apple AI: ఆపిల్ AI వైస్ ప్రెసిడెంట్‌గా.. అమర్ సుబ్రమణ్య నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థల మధ్య కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ తీవ్రంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో, టెక్ దిగ్గజం ఆపిల్ కీలక నాయకత్వ మార్పులు ప్రకటించింది. కంపెనీ AI విభాగాన్ని భారతీయ నిపుణుడు అమర్ సుబ్రమణ్య కు అప్పగించింది. ఆయనను ఆపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు AI చీఫ్‌గా జాన్ జియానాండ్రియా బాధ్యతలు నిర్వహించేవారు. త్వరలో ఆయన స్థానాన్ని అమర్ సుబ్రమణ్య భర్తీ చేస్తారని కంపెనీ తెలిపింది. వైస్ ప్రెసిడెంట్ హోదాలో, ఆయన AI విభాగాన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తారని ఆపిల్ ప్రకటించింది. జాన్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు.
వివరాలు
గూగుల్ డీప్‌మైండ్ యూనిట్‌లో AI రీసెర్చ్ ప్రాజెక్ట్లలో కీలక పాత్ర
అప్పటివరకు ఆయన అడ్వైజర్ హోదాలో కొనసాగుతారని, కంపెనీ వెల్లడించింది. మరోవైపు, 'సిరి'లో కీలక AI అప్‌డేట్లు వచ్చే ఏడాదికి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ నాయకత్వ మార్పు మరింత ప్రాముఖ్యత పొందింది. భారతీయులైన అమర్ సుబ్రమణ్య బెంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్య పూర్తిచేశారు. తరువాత, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పొందారు. కెరీర్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలలో అనుభవం సంపాదించారు. గూగుల్ డీప్‌మైండ్ యూనిట్‌లో AI రీసెర్చ్ ప్రాజెక్ట్లలో కీలక పాత్రను నిర్వహించారు.