Apple: మార్చి నాటికి ఆపిల్ 600,000 కొత్త ఉద్యోగాలు !
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఈ విస్తరణలో భాగంగా శ్రామిక శక్తిని భారీగా పెంచడానికి కృషి చేస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, ఆపిల్ వచ్చే ఏడాదిలోనే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుంది. 2025 మార్చి నాటికి ఈ కంపెనీ 6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశముందని భావిస్తున్నారు. భారతదేశంలో శ్రామిక శక్తిని పెంచడానికి చేపడుతున్న చర్యలపై ఆపిల్ ప్రభుత్వం ముందు ఓ నివేదికను సమర్పించింది. వ్యాపార విస్తరణ ద్వారా దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆ నివేదికలో వివరించబడింది. ఆపిల్ ప్రస్తుతం చైనాపై ఉన్న ఉత్పత్తి ఆధారాన్ని తగ్గించి, భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.
నియామకాల్లో 70శాతం మహిళలు
ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రత్యక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఆపిల్ భావిస్తోంది. ఈ నియామకాల్లో 70శాతం మహిళలు ఉండవచ్చని అంచనా.యాపిల్ కాంట్రాక్ట్ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్,విస్ట్రాన్,పెగట్రాన్ ఇప్పటికే 80,872 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాయి. అదనంగా, ఆపిల్ సరఫరా కంపెనీలైన టాటా గ్రూప్,సాల్కాంప్,మథర్‌సన్, ఫాక్స్‌లింక్, ఏటీఎల్ ద్వారా 84,000 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు పొందారు.
ఐఫోన్ యూనిట్‌లో ఉద్యోగ అవకాశాలు
బ్లూ కాలర్ ఉద్యోగాల్లో అగ్రగామిగా ఆపిల్ నిలిచింది. 2020లో ప్రారంభమైన పీఎల్‌ఐ (PLI) స్కీమ్ కింద ఇప్పటివరకు యాపిల్ 1,65,000 మందిని నియమించింది. తమిళనాడులోని ఐఫోన్ యూనిట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి పరోక్షంగా మూడు అదనపు ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.