Apple-OpenAI: ఆపిల్ వాణిజ్య రహస్యాల చోరీ.. ఓపెన్‌ఏఐపై కోర్టును ఆశ్రయించిన సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
గోప్యత, కృత్రిమ మేధ (ఏఐ) ఉత్పత్తుల అభివృద్ధి అంశాల్లో పోటీపడుతున్న టెక్ దిగ్గజాలు ఆపిల్, ఓపెన్‌ఏఐ మధ్య వివాదం మరింత ముదిరింది. తమ వ్యాపార రహస్యాలు, గోప్య సమాచారాన్ని అక్రమంగా సేకరించి వినియోగించుకున్నారని ఆరోపిస్తూ యాపిల్ ఓపెన్‌ఏఐపై కోర్టును ఆశ్రయించింది. ఇదే కేసులో యాపిల్‌లో గతంలో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులపైనా చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఆపిల్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. సంస్థకు చెందిన డిజైన్‌లు, తయారీ ప్రక్రియలు, సరఫరా గొలుసు వ్యూహాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని సేకరించేందుకు మాజీ ఉద్యోగులు ఓపెన్‌ఏఐతో కలిసి వ్యవహరించినట్లు ఆరోపించింది.
వివరాలు
టాన్ గతంలో ఆపిల్‌లో కీలక బాధ్యతలు
ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాత కూడా కంపెనీ ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇవ్వలేదని, అనంతరం అందులో ఉన్న సాంకేతిక లోపాన్ని ఉపయోగించి ఆపిల్ అంతర్గత నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి సున్నితమైన సమాచారాన్ని సేకరించారని పేర్కొంది. ప్రస్తుతం ఓపెన్‌ఏఐలో హార్డ్‌వేర్ చీఫ్‌గా పనిచేస్తున్న టాన్ గతంలో ఆపిల్‌లో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఆపిల్‌ను వీడే ముందు సరఫరాదారుల వివరాలు, సంస్థ అంతర్గత సమాచారం తదితరాలను తన వ్యక్తిగత ఈమెయిల్‌కు పంపించుకున్నారని ఆరోపించింది. అనంతరం ఆ సమాచారాన్ని ఓపెన్‌ఏఐ ప్రయోజనాల కోసం ప్రణాళికాబద్ధంగా వినియోగించినట్లు దావాలో పేర్కొంది.
వివరాలు
ఓపెన్‌ఏఐలో 400 మంది ఆపిల్ మాజీ ఉద్యోగులు
అంతేకాదు, ఓపెన్‌ఏఐలో నిర్వహించే 'షో అండ్ టెల్' ఇంటర్వ్యూ సెషన్‌ల కోసం అప్పట్లో ఆపిల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పరికరాల విడిభాగాలు తీసుకురావాలని టాన్ ప్రోత్సహించారని కూడా ఆపిల్ ఆరోపించింది. ప్రస్తుతం ఆపిల్‌లో పనిచేసిన సుమారు 400 మంది మాజీ ఉద్యోగులు ఓపెన్‌ఏఐలో సేవలందిస్తున్నారని వెల్లడించింది. హార్డ్‌వేర్ రంగంలోని వాణిజ్య రహస్యాలపై పనిచేసిన ఉద్యోగులు ఆ సమాచారాన్ని కొత్త సంస్థలో ఉపయోగించుకునే హక్కు లేదని యాపిల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా,ఓపెన్‌ఏఐ హార్డ్‌వేర్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా'ఐఓ ప్రొడక్ట్స్'అనే హార్డ్‌వేర్ స్టార్టప్‌ను 6.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థను యాపిల్ మాజీ డిజైనర్ జానీ ఐవ్ స్థాపించినప్పటికీ, ఆయన పేరును ప్రస్తుత దావాలో చేర్చలేదని వెల్లడైంది.
వివరాలు
టెక్నాలజీ రంగంలో గోప్యత, వాణిజ్య రహస్యాల పరిరక్షణపై మరోసారి చర్చ
ఏఐ ఉత్పత్తుల అభివృద్ధిలో పెరుగుతున్న పోటీతో రెండు సంస్థల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. తమ గోప్య సమాచారం ఓపెన్‌ఏఐకు చేరుతుందనే అనుమానాలపై చర్చించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆపిల్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారం టెక్నాలజీ రంగంలో గోప్యత, వాణిజ్య రహస్యాల పరిరక్షణపై మరోసారి చర్చకు దారితీసింది.