Page Loader
భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి
యాక్సిస్‌ బ్యాంక్‌ లాభంలో 40 శాతం వృద్ధి

భారీ లాభాలను ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌.. గతేడాదితో పోల్చితే 40 శాతం వృద్ధి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 26, 2023
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్ లో భారీ లాభాలను ప్రకటించింది. జూన్‌తో మొదటి త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో ఫలితాలను వెల్లడించింది. ఈ మేరకు రూ.5,797 కోట్ల భారీ లాభాన్ని ఆర్జించినట్లు వివరించింది. గతేడాది ఇదే త్రైమాసికం(Q1)లో రూ.4,125 కోట్లను ఆర్జించింది. కిందటి సంవత్సరం లాభాలతో పోలిస్తే కంపెనీకి దాదాపుగా 40.5 శాతం మేర వృద్ధి సాధించింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.21 వేల 657 కోట్ల నుంచి రూ.30 వేల 644 కోట్లకు పెరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.18 వేల 729 కోట్ల నుంచి రూ.25 వేల 557 కోట్లకు చేరినట్లు వివరించింది.

DETAILS

రూ.11 వేల 959 కోట్లకు చేరుకున్న నికర వడ్డీ ఆదాయం

నికర వడ్డీ ఆదాయం (NII) 27 శాతానికి పెరిగి రూ.11 వేల 959 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ చెప్పుకొచ్చింది. నికర వడ్డీ మార్జిన్‌ (NIM) 3.6 శాతం నుంచి 4.10 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ చెప్పింది. ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు (NPA) విలువ 2.76 శాతం నుంచి 1.96 శాతానికి తగ్గింది. ఈ మేరకు నికర నిరర్థక ఆస్తుల విలువ 0.64 శాతం నుంచి 0.41 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. మార్కెట్‌ ముగిసే సమయానికి స్టాక్‌ విలువ 1.37 శాతం పెరిగి రూ.975.70కు చేరుకుంది. మరోవైపు PNB బ్యాంకు నాలుగింతల లాభం గడించింది. జూన్‌తో మొదటి త్రైమాసికం ముగియడంతో 307 శాతం వృద్ధి సాధించింది.