అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు
ఇకపై ఏటీఎం కార్డు వెంట తీసుకురాకపోయినా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు మరో కొత్త సర్వీసుని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే యోనో యాప్ లో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు లేకున్నా యోనో యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చని వెల్లడించింది. ఎస్‌బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు ఈ యాప్ ను వాడుకోవచ్చని తెలిపింది. లావాదేవీలు, షాపింగ్ లు, యూపీఐ వంటి ఇతర చెల్లింపులను యోనో యాప్ లోనూ చేసుకోవచ్చునని వివరించింది.
యోనో యాప్ లో స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ సదుపాయాలు ఉంటాయి
ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం ఎస్‌బీఐ ఏటీఎంల్లో మాత్రమే కొనసాగిస్తున్నారు. తాజాగా అన్ని ఏటీఎంలకు ఈ సేవలను విస్తరిస్తూ యోనో బ్యాంక్ యాప్ ను అప్‌గ్రేడ్ చేసింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులూ యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఇందుకోసం యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్ అంటూ ఈ ప్రత్యేక సర్వీసును రూపొందించింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలు ఇందులో పొందుపర్చినట్లు బ్యాంకు వివరించింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ వచ్చేశాక చాలా వరకు నగదు విత్ డ్రా తగ్గిపోయింది. ఈ మేరకు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే చకచకా జరిగిపోతున్నాయి.
ఏ బ్యాంక్ ఖాతాదారుడైనా కార్డ్ లెస్ మనీ విత్ డ్రా చేసుకోవచ్చు
ఇదే క్రమంలో ఏటీఎంల్లో డబ్బులు తీసుకునేవారు తగ్గిపోయారు. అయితే ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే సంబంధిత బ్యాంకు ఏటీఎం కార్డు తప్పనిసరి. వివిధ కారణాలతో కార్డు ఇంట్లోనే మర్చిపోయి రావడం, కొన్ని సందర్భాల్లో కార్డు పోతే కొత్త కార్డు వచ్చేందుకు సమయం పట్టడం, మరో కోణంలో ఏటీఎం కార్డు మీద గీతలు పడి పనిచేయకపోవడం, కార్డు విరిగిపోవడం లాంటి ఎన్నో అవాంతరాలకు ఈ ఒక్క యాప్ తో బ్యాంక్ చెక్ పెట్టగలిగింది. ఈ క్రమంలోనే ఇకపై ఏటీఎం కార్డు లేకున్నా సరే కోరుకున్న నగదును తీసుకునేలా, కార్డ్ లెస్ మనీ విత్ డ్రాల్ పద్ధతిని ప్రవేశపెట్టి ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృషి చేస్తోంది.