Axis Bank: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 28 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక సమాచారం. క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు చేస్తున్నట్లు Axis Bank ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 28 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా విదేశాల్లో క్రెడిట్ కార్డు వినియోగించే వారికి వర్తించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్, ఆలస్య చెల్లింపు రుసుముల్లో మార్పులు ఉన్నాయి. బ్యాంకు తాజాగా విడుదల చేసిన క్రెడిట్ కార్డుల ముఖ్యమైన నిబంధనలు, షరతులు (MITC)లో ఈ మార్పులను వివరించింది.
వివరాలు
విదేశాల్లో Axis Bank కార్డుతో చెల్లింపులు.. DCC ఛార్జీ 3.5 శాతానికి పెంపు
విదేశాల్లో Axis Bank క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసే సమయంలో DCC ఛార్జీ పెరగనుంది.
ప్రస్తుతం 1.5 శాతంగా ఉన్న DCC మార్కప్‌ను 3.5 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంకు తెలిపింది.
దీనికి అదనంగా వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో క్రెడిట్ కార్డుతో చెల్లించే సమయంలో స్థానిక కరెన్సీకి బదులుగా భారతీయ రూపాయల్లో చెల్లించడాన్ని ఎంచుకున్నప్పుడు ఈ ఛార్జీ వర్తిస్తుంది.
అలాగే విదేశాల్లో ఉన్న వ్యాపారి సంస్థకు సంబంధించిన కొన్ని లావాదేవీలను భారత్‌లో చేసినా ఈ మార్పు వర్తించనుంది.
వివరాలు
క్రెడిట్ కార్డు బకాయిలపై కొత్త లేట్ ఫీజు.. రూ.50 వేలపైన రూ.1,300
ఇక క్రెడిట్ కార్డు బకాయిలను గడువులోగా చెల్లించకపోతే విధించే లేట్ పేమెంట్ ఫీజు విధానాన్ని కూడా Axis Bank మార్చింది.
రూ.50,000 కంటే ఎక్కువ బకాయి ఉన్నప్పుడు ఇకపై రూ.1,300 లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రుసుముల ప్రకారం.. రూ.500 వరకు బకాయికి ఎలాంటి లేట్ ఫీజు ఉండదు.
రూ.501 నుంచి రూ.5,000 వరకు బకాయికి రూ.500, రూ.5,001 నుంచి రూ.10,000 వరకు రూ.750, రూ.10,001 నుంచి రూ.50,000 వరకు రూ.1,200 లేట్ పేమెంట్ ఫీజుగా ఉంటుంది.
ఈ మార్పుల్లో తక్కువ బకాయిలకు సంబంధించిన కొన్ని స్లాబ్‌లు యథాతథంగా ఉంటాయని బ్యాంకు స్పష్టం చేసింది.
వివరాలు
Axis Bank క్రెడిట్ కార్డు కొత్త రూల్స్.. పాక్షిక చెల్లింపులు, గిఫ్ట్ కార్డులపై కీలక మార్పులు
క్రెడిట్ కార్డు బకాయిల్లో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించినప్పుడు ఆ డబ్బును ఎలా సర్దుబాటు చేస్తారనే విషయాన్ని కూడా కొత్త నిబంధనల్లో Axis Bank స్పష్టం చేసింది.
ముందుగా ఫీజులు,ఇతర ఛార్జీలు,వాటిపై వర్తించే పన్నులకు చెల్లింపును సర్దుబాటు చేస్తారు.
ఆ తర్వాత EMIలు,వడ్డీ,కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలు, నగదు ఉపసంహరణలకు సంబంధించిన బకాయిలను సర్దుబాటు చేస్తారు.
అదేసమయంలో గిఫ్ట్ కార్డు కొనుగోళ్లకు సంబంధించి కూడా వర్గీకరణలో మార్పు చేసింది.
ఆగస్టు 28 నుంచి గిఫ్ట్ కార్డు కొనుగోళ్లను ప్రత్యేకంగా'Gift Card'కేటగిరీ కింద చూపించనున్నారు. ఇప్పటివరకు ఇవి వాలెట్ కేటగిరీలో ఉండేవి.
దీంతో Axis Bank క్రెడిట్ కార్డు వినియోగదారులు ముఖ్యంగా విదేశాల్లో లావాదేవీలు చేసేవారు,పెద్ద మొత్తంలో బకాయిలు ఉంచుకునేవారు కొత్త ఛార్జీలు,నిబంధనలను గమనించాల్సి ఉంటుంది.