Loading...
Vishal Garg: అప్పుడు 900 మందిని తీసేశారు.. ఇప్పుడు ఆయనే ఉద్యోగం కోల్పోయారు
అప్పుడు 900 మందిని తీసేశారు.. ఇప్పుడు ఆయనే ఉద్యోగం కోల్పోయారు

Vishal Garg: అప్పుడు 900 మందిని తీసేశారు.. ఇప్పుడు ఆయనే ఉద్యోగం కోల్పోయారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన బెటర్‌ హోమ్‌ & ఫైనాన్స్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ తన పదవిని కోల్పోయారు. దాదాపు ఐదేళ్ల క్రితం జూమ్‌ కాల్‌లో ఏకంగా 900 మంది ఉద్యోగులను తొలగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయనను తాజాగా సీఈవో బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో డేనియల్‌ లూయిస్‌ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. జులై 27న బెటర్‌ బోర్డులో చేరిన లూయిస్‌.. కొద్ది రోజులకే సీఈవో బాధ్యతలు చేపట్టారు.

వివరాలు

లూయిస్‌ నన్ను మోసం చేశారు

తనను పదవి నుంచి తప్పించడంపై గార్గ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లూయిస్‌ బోర్డు సభ్యులను తనకు వ్యతిరేకంగా ఒప్పించి తనను తొలగించేలా చేశారని ఆరోపించారు.

కొన్ని నెలల క్రితం లూయిస్‌ తనను సంప్రదించి కంపెనీ ఖర్చులను తగ్గించడం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారని గార్గ్‌ తెలిపారు.

ఆయనపై నమ్మకంతోనే బోర్డులో చోటు కల్పించానని.. కానీ చివరకు తన పదవికే ఎసరు పెట్టారని గార్గ్‌ ఆరోపించారు.

వివరాలు

కంపెనీ వ్యాపారానికి భారీ దెబ్బ

కరోనా మహమ్మారి సమయంలో గార్గ్‌ నాయకత్వంలో బెటర్‌ హోమ్‌ & ఫైనాన్స్‌ భారీగా విలువ పెంచుకుంది.

అయితే అమెరికాలో మార్ట్గేజ్‌ వడ్డీ రేట్లు దాదాపు 7 శాతానికి చేరడంతో రీఫైనాన్సింగ్‌ కార్యకలాపాలు భారీగా పడిపోయాయి.

దీంతో కంపెనీ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. 2021లో కంపెనీ వార్షిక అమ్మకాలు 1.5 బిలియన్‌ డాలర్లు ఉండగా.. 2023 నాటికి అవి కేవలం 70 మిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.

ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 300 మిలియన్‌ డాలర్లకు చేరినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

వరుస వివాదాల్లో గార్గ్

బెటర్‌ హోమ్‌ & ఫైనాన్స్‌లో గార్గ్‌ పదవీకాలం పలు వివాదాలతో సాగింది. 2021లో జూమ్‌ కాల్‌ ద్వారా 900 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

దీంతో ఆయన కొంతకాలం సెలవులోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కంపెనీపై ఓ విజిల్‌బ్లోయర్‌ దావా, అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC) దర్యాప్తు ఎదురయ్యాయి.

2023లో జరిగిన SPAC విలీన ఒప్పందం కూడా కంపెనీకి ప్రతికూలంగా మారింది. దీంతో కంపెనీ షేరు విలువ ఏకంగా 93 శాతం పడిపోయింది

ADVERTISEMENT

వివరాలు

ఏఐతో మళ్లీ పుంజుకునే ప్రయత్నం

ఇన్ని సవాళ్ల మధ్య కూడా కంపెనీని తిరిగి గాడిలో పెట్టే దిశగా తాను చర్యలు చేపట్టానని గార్గ్‌ చెబుతున్నారు.

మార్ట్గేజ్‌ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేధ (AI)ను వినియోగించడం ప్రారంభించామని తెలిపారు.

గతంలో ఈ ప్రక్రియకు పలువురు ఉద్యోగులు కొన్ని రోజులు సమయం తీసుకునేవారని.. ఏఐతో దాన్ని వేగంగా పూర్తి చేయగలిగామని చెప్పారు.

అలాగే గార్గ్‌ హయాంలో బెటర్‌ సంస్థ నియో హోమ్‌ లోన్స్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

దీంతో ఉత్పాదకత రెట్టింపైందని, రుణాల ప్రారంభ ప్రక్రియకు అయ్యే ఖర్చులు 50 శాతం తగ్గాయని గార్గ్‌ పేర్కొన్నారు.

వివరాలు

తిరిగి సీఈవో కావాలని ప్రయత్నాలు

పదవి నుంచి తొలగించినప్పటికీ తిరిగి సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు గార్గ్‌ ప్రయత్నిస్తున్నారు.

తన తొలగింపు తర్వాత పలువురు పెట్టుబడిదారులు తనను సంప్రదించి తిరిగి కంపెనీకి రావాలని కోరినట్లు ఆయన చెబుతున్నారు.

గార్గ్‌ వద్ద ప్రత్యేక ఓటింగ్‌ హక్కులు కలిగిన క్లాస్‌-బీ షేర్లు ఉన్నాయి. తన తరఫున ప్రముఖ న్యాయవాది అలెక్స్‌ స్పిరోను నియమించుకున్నారు.

కంపెనీ బోర్డు తనను తిరిగి సీఈవోగా నియమించాలని కోరుతున్న ఆయన.. బెటర్‌ లాభాల్లోకి వచ్చే వరకు ఏడాదికి కేవలం 1 డాలర్‌ జీతంతో పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు.

ADVERTISEMENT