LOADING...
Bank Deposits: 15 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు.. బ్యాంకింగ్ రంగంలో భారీ వృద్ధి: ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్
ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్

Bank Deposits: 15 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు.. బ్యాంకింగ్ రంగంలో భారీ వృద్ధి: ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి గణనీయంగా నమోదైంది. కేవలం 15రోజుల వ్యవధిలోనే బ్యాంకు డిపాజిట్లు దాదాపు రూ.7లక్షల కోట్ల మేర పెరిగినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. జూన్‌ 15 నుంచి 30వ తేదీ మధ్య నమోదైన ఈ పెరుగుదల గత 29ఏళ్లలో పక్షం రోజుల వ్యవధిలో నమోదైన మూడో అతిపెద్ద వృద్ధిగా నిలిచిందని నివేదిక పేర్కొంది. ఎస్‌బీఐ రీసెర్చ్‌ వివరాల ప్రకారం,ఈ 15రోజుల్లో మొత్తం బ్యాంకు డిపాజిట్లు రూ.6.97లక్షల కోట్ల మేర పెరిగాయి. ఇందులో సుమారు రూ.3.5లక్షల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్ల వరకు నేరుగా ఖాతాదారులు జమ చేసిన నిధులే కావడం విశేషం.

వివరాలు 

భారత్‌లోకి 7 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ సంస్థాగత పెట్టుబడులు

మిగిలిన డిపాజిట్ల పెరుగుదలకు ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ (FCNR-B) డిపాజిట్లు, ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ECB) ద్వారా వచ్చిన భారీ నిధులు ప్రధాన కారణంగా నివేదిక స్పష్టం చేసింది. దేశంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, రూపాయి మారక విలువను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా ఈ వృద్ధికి తోడ్పడ్డాయని ఎస్‌బీఐ విశ్లేషించింది. వాటి ప్రభావంతో సుమారు 7 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FIIలు) భారత్‌లోకి వచ్చాయని, దీని విలువ దాదాపు రూ.66 వేల కోట్లుగా ఉంటుందని నివేదిక వెల్లడించింది.

వివరాలు 

4.4 బిలియన్ డాలర్ల మేర పెరిగిన విదేశీ మారక నిల్వలు 

ఇక రిజర్వ్ బ్యాంక్ విదేశీ మారక నిల్వలు కూడా 4.4 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు నివేదిక తెలిపింది. బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరగడంతో నగదు లభ్యత మెరుగుపడుతుందని, దీంతో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (CD)ల ద్వారా బ్యాంకులు సమీకరించే రుణాల అవసరం తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ పేర్కొంది. ఈ పరిణామాలు దేశ బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి, ఆర్థిక వృద్ధికి సానుకూల సంకేతాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement