Bending Spoons: మెయిల్‌చింప్‌ను రూ.3.68 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్న బెండింగ్ స్పూన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ట్యాక్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇంట్యూట్ (Intuit) తన మార్కెటింగ్ అనుబంధ సంస్థ మెయిల్‌చింప్ (Mailchimp)ను విక్రయించేందుకు నిర్ణయించింది. ఇటలీకి చెందిన టెక్నాలజీ సంస్థ బెండింగ్ స్పూన్స్ (Bending Spoons)కు ఈ సంస్థను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 368 కోట్ల డాలర్లు (సుమారు 3.68 బిలియన్ డాలర్లు). నగదు, షేర్ల రూపంలో ఈ లావాదేవీ జరగనుంది. 2027 ప్రారంభంలో ఈ ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉందని CNBC వెల్లడించింది. 2021లో మెయిల్‌చింప్‌ను ఇంట్యూట్ ఏకంగా 1,200 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు దానిని తాను చెల్లించిన ధరలో మూడో వంతు కంటే తక్కువ మొత్తానికే విక్రయిస్తుండటం గమనార్హం.
వివరాలు
ఆదాయం తగ్గడంతో మెయిల్‌చింప్ విక్రయానికి ఇంట్యూట్ నిర్ణయం
మెయిల్‌చింప్ విక్రయం ఇంట్యూట్ వ్యాపార వ్యూహంలో కీలక మార్పుగా భావిస్తున్నారు.
తొలుత పన్నులు, అకౌంటింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితమైన ఈ సంస్థ.. మెయిల్‌చింప్ కొనుగోలుతో మార్కెటింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.
అయితే ఐదేళ్లు గడిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మెయిల్‌చింప్ ఆదాయం క్రమంగా తగ్గుతుండటంతో పాటు, ఇంట్యూట్ వృద్ధి ప్రణాళికలకు కూడా ఈ పరిణామం ప్రభావం చూపుతోంది.
దీంతో ఆ సంస్థను విక్రయించాలని ఇంట్యూట్ నిర్ణయించింది.
2021లో భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన సంస్థను ఇప్పుడు చాలా తక్కువ ధరకు అమ్మకానికి పెట్టడం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
కొనుగోళ్లతో వ్యాపారాన్ని విస్తరిస్తున్న బెండింగ్ స్పూన్స్
బెర్క్‌షైర్ హాత్‌వే మద్దతు ఉన్న టెక్నాలజీ సంస్థ బెండింగ్ స్పూన్స్.. ఇతర టెక్ కంపెనీలను కొనుగోలు చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది.
ఈ సంస్థ దూకుడైన కొనుగోళ్ల వ్యూహానికి పేరుగాంచింది. ఇప్పటికే ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్ స్టార్టప్ ఎయిర్‌టేబుల్‌ను కూడా దాని అసలు విలువతో పోలిస్తే తక్కువ మొత్తానికే కొనుగోలు చేసింది.
మెయిల్‌చింప్‌తో పాటు AOL, బ్రైట్‌కోవ్, ఈవెంట్‌బ్రైట్, ఎవర్నోట్, మీటప్, విమియో, వీట్రాన్స్‌ఫర్ వంటి టెక్నాలజీ సంస్థలు కూడా బెండింగ్ స్పూన్స్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
తాజా కొనుగోలుతో డిజిటల్ మార్కెటింగ్ రంగంలోనూ తన ఉనికిని మరింత పెంచుకోనుంది.
వివరాలు
ఇంట్యూట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు
అక్టోబర్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇంట్యూట్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది.
ఒక్కో షేరుపై సర్దుబాటు చేసిన ఆదాయం 2.91డాలర్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 435కోట్ల డాలర్లకు చేరింది.
విశ్లేషకులు ఒక్కో షేరుపై 2.70డాలర్ల ఆదాయం,431కోట్ల డాలర్ల మొత్తం ఆదాయాన్ని అంచనా వేశారు.
ఈ అంచనాలను కంపెనీ అధిగమించింది.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇంట్యూట్ ఆదాయం 12శాతం పెరిగింది.
అయితే ఇదే సమయంలో మెయిల్‌చింప్ ఆదాయం మాత్రం ఒక శాతం తగ్గి 31.3కోట్ల డాలర్లకు పరిమితమైంది.
ఈ సంస్థ ఆదాయం 31.44 కోట్ల డాలర్లుగా ఉంటుందని స్ట్రీట్‌అకౌంట్ అంచనా వేయగా, దానికంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.
మెయిల్‌చింప్ ఆదాయంలో తగ్గుదలే విక్రయ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది.