Page Loader
Dunzo: బెంగళూరు కంపెనీ డుంజోలో  75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు 
బెంగళూరు కంపెనీ డుంజోలో 75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు

Dunzo: బెంగళూరు కంపెనీ డుంజోలో  75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2024
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో ప్రముఖ స్టార్టప్ దివాలా తీసే పరిస్థితికి చేరింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది. ఈ క్రమంలో, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ మద్దతుతో ఉన్న డంజో భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది. తాజాగా, 150 మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది, ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 75 శాతానికి సమానం. అంటే, 200 మంది ఉద్యోగుల్లో 150 మందిని తొలగించగా.. ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఈ -కామర్స్ డెలివరీ సంస్థలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు కోర్ సప్లై, మార్కెట్‌ప్లేస్ విభాగాల్లో పని చేస్తున్నారు. గతంలో కూడా ఈ సంస్థ పలు మార్లు లేఆఫ్స్ ప్రకటించింది.

వివరాలు 

10-15 రోజుల్లో బకాయిల చెల్లింపు 

ఈ సంస్థ ప్రధానంగా నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఉద్యోగుల సహా వెండర్లకు డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. లేఆఫ్స్‌తో ప్రభావితమైన ఉద్యోగులకు డంజో ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. పెండింగ్ జీతాలు, ఇతర పరిహారం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బకాయిలను నిధులు అందిన తర్వాత చెల్లిస్తామని తెలిపింది. 2024 మేలో 22-25 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ, అర్ధంతరంగా దీనికి అడ్డంకులు ఏర్పడ్డాయి. జులై మధ్యలో ఈ డీల్ త్వరలోనే పూర్తవుతుందని, 10-15 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని తెలిపింది, కానీ ఇది కూడా పూర్తిగా జరగలేదు.

వివరాలు 

పలు విడతల్లో ఉద్యోగులను తొలగింపు

2022 జనవరిలో ఈ కంపెనీ విలువ 775 మిలియన్ డాలర్లకుపైగా ఉండేది, కానీ తర్వాత నిధుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా సార్లు ఉద్యోగులకు జీతాలు పెండింగ్‌లో పెట్టింది, తర్వాత పలు విడతల్లో ఉద్యోగులను తొలగించింది. రిలయన్స్ రిటైల్ ఈ సంస్థలో 25.8 శాతం వాటా కలిగి ఉంది. ఇది సింగిల్ లార్జెస్ట్ షేర్‌హోల్డర్. గూగుల్, వెంచర్ ఇన్వెస్టర్ లైట్‌బాక్స్ కూడా ఈ సంస్థలో వాటాలు కలిగి ఉన్నాయి.

వివరాలు 

2025లో ఐపీఓకు..

2021లో డంజో డైలీ కింద ఈ స్టార్టప్ లాంఛ్ అయింది. రిలయన్స్ రిటైల్ వెంచర్ కింద 240 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 1802 కోట్లు నష్టపోయింది. పలు డైరెక్టర్లు కూడా కంపెనీ నుంచి తప్పుకున్నారు. అయితే.. 2025లో ఇది ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే లాభదాయక సంస్థగా మారేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు సమాచారం.