India's Second Most Valuable Company: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటేసిన భారతి ఎయిర్‌టెల్.. దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారీ దూకుడు చూపించింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో HDFC Bankను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మొదటి స్థానంలో Reliance Industries కొనసాగుతోంది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.11.90 లక్షల కోట్లకు చేరుకోగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11.80 లక్షల కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మాత్రం రూ.18.11 లక్షల కోట్లకు పైగా ఉంది.
వివరాలు
మే నెలలో ఇప్పటివరకు దాదాపు 4 శాతం లాభం
భారతి ఎయిర్‌టెల్ షేర్లు వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సోమవారం బీఎస్‌ఈలో షేర్ ధర దాదాపు 3 శాతం పెరిగి రూ.1,953.95 ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 11 శాతం కంటే ఎక్కువ ఎగబాకింది. మే నెలలో ఇప్పటివరకు దాదాపు 4 శాతం లాభపడగా.. ఏప్రిల్‌లో 6 శాతం పెరిగింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు మేలో స్థిరంగానే ఉండగా.. ఏప్రిల్‌లో 5.49 శాతం పెరిగాయి. గత ఏడాది నవంబర్ 21న భారతి ఎయిర్‌టెల్ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,174.70ను తాకగా.. ఈ ఏడాది మే 13న రూ.1,745 కనిష్ట స్థాయికి చేరింది.
వివరాలు
నాల్గో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన కంపెనీ
ఇదే రోజున కంపెనీ తన నాల్గో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం త్రైమాసిక ప్రాతిపదికన 10.5 శాతం పెరిగి రూ.7,325 కోట్లకు చేరింది. అయితే గత ఏడాదితో పోలిస్తే 33.5 శాతం తగ్గింది. గత ఏడాది పన్ను రాయితీలు రావడం వల్ల అప్పటి లాభాలు అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. క్యూ4 ఫలితాల తర్వాత బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ స్టాక్‌పై 'బై' రేటింగ్ కొనసాగించింది. టార్గెట్ ధరను రూ.2,180గా నిర్ణయించింది. భారత్‌లో టారిఫ్ పెంపులు, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల పెరుగుదల, ఆఫ్రికా వ్యాపార విస్తరణతో వచ్చే రెండేళ్లలో కంపెనీ ఆదాయం, EBITDA బలంగా పెరుగుతాయని అంచనా వేసింది.
వివరాలు
కొత్తగాఎంట్రీ ఇవ్వాలనుకునే ఇన్వెస్టర్లు మరికొంత సమయం వేచి చూడాలి
టెక్నికల్ అనలిస్టులు మాత్రం ప్రస్తుతం స్టాక్‌లో కరెక్షన్ దశ కొనసాగుతోందని చెబుతున్నారు. రూ.1,750స్థాయి పైగా ఉంటే దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనసాగవచ్చని సూచిస్తున్నారు. గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్‌కు చెందిన విపిన్ కుమార్ ప్రకారం.. గత 12వారాలుగా స్టాక్ రూ.1,750నుంచి రూ.1,900మధ్య కన్‌సాలిడేషన్‌లో ఉండగా..ఇటీవల ఆ రేంజ్‌ను బ్రేక్ చేసింది. త్వరలోనే రూ.2,100 స్థాయిని పరీక్షించే అవకాశం ఉందన్నారు. అయితే ఏటీ రీసెర్చ్ అండ్ రిస్క్ మేనేజర్స్ విశ్లేషకుడు ఆదిత్య థుక్రాల్ మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత కొద్దిరోజుల ర్యాలీ ఉన్నప్పటికీ స్టాక్ ఇంకా కరెక్షన్ దశలోనే ఉందని చెప్పారు. వచ్చేనెలల్లో రూ.1,500 నుంచి రూ.1,600స్థాయిలకు పడిపోయే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమన్నారు. అందువల్ల కొత్తగాఎంట్రీ ఇవ్వాలనుకునే ఇన్వెస్టర్లు మరికొంత సమయం వేచి చూడాలని సూచించారు.