Bharti-Haier deal: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లోకి సునీల్ మిత్తల్ ఎంట్రీ.. హైయర్ ఇండియాలో 49% వాటా కొనుగోలు చేసిన భారతీ ఎంటర్‌ప్రైజెస్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. చైనాకు చెందిన ప్రముఖ సంస్థ హైయర్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న హైయర్ ఇండియాలో వాటాలను కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడికి సంబంధించి గ్లోబల్ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్‌తో భారతీ ఎంటర్‌ప్రైజెస్ భాగస్వామ్యమైంది. ఈ రెండు సంస్థలు కలిసి హైయర్ ఇండియాలో 49శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. దీనికి సంబంధించిన సంయుక్త ప్రకటనను విడుదల చేసినప్పటికీ, ఒప్పంద విలువకు సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం హైయర్ ఇండియా దేశవ్యాప్తంగా ఏసీలు, ఫ్రిజ్‌లు, టెలివిజన్లు, వాషింగ్ మెషిన్లు సహా పలు గృహోపకరణాలను విక్రయిస్తోంది. గత ఏడేళ్లుగా ఈ సంస్థ సగటున ఏటా 25 శాతం వృద్ధిరేటు (సీఏజీఆర్)తో దూసుకుపోతోంది.
వివరాలు
హైయర్ ఇండియా వృద్ధికి ఊతం
తాజా డీల్ పూర్తయ్యాక హైయర్ ఇండియాలో హైయర్ గ్రూప్ వద్ద 49 శాతం వాటా కొనసాగనుండగా, మిగిలిన 2 శాతం వాటా కంపెనీ మేనేజ్‌మెంట్ టీమ్ వద్ద ఉండనుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత మార్కెట్‌లో హైయర్ ఇండియా కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశముందని సంయుక్త ప్రకటనలో సంస్థలు వెల్లడించాయి. ఆవిష్కరణల్లో హైయర్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఉన్న బలమైన నెట్‌వర్క్ సామర్థ్యం, బ్రాండ్‌లను పెంచడంలో వార్‌బర్గ్ పింకస్‌కు ఉన్న విశేష ట్రాక్ రికార్డ్ కలిసి హైయర్ ఇండియా వృద్ధికి ఊతమిస్తాయని పేర్కొన్నాయి. హైయర్ ఇండియాలో పెట్టుబడుల ద్వారా దేశీయ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో తమ స్థితిని మరింత బలోపేతం చేయడమే ఇరు సంస్థల లక్ష్యమని వెల్లడించాయి.