Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్.. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇవ్వబోతుందా అన్న చర్చలు జోరందుకున్నాయి. త్వరలోనే ఇంధన ధరలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలే అని తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్‌కు ధర 70 డాలర్ల నుంచి ఏకంగా 126 డాలర్ల వరకు ఎగబాకినట్లు సమాచారం. ప్రస్తుతం కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
వివరాలు
మే15లోపు నిర్ణయం
ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నెలకు సుమారు రూ.30 వేల కోట్ల వరకు నష్టాలను భరిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన దిగుమతి వ్యయం పెరగడం, అంతర్జాతీయ ధరల ఒత్తిడి కారణంగా ఈ భారం మరింత పెరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు రిటైల్ ధరలను పెంచకుండా ప్రభుత్వమే, చమురు సంస్థలే వినియోగదారులపై భారం పడకుండా నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ధరల పెంపు నిలిపివేసినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ధరల సమీక్షపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మే 15లోపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చర్చించనున్నాయని సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాలు
2022 తర్వాత దేశంలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు
ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ప్రస్తుతం ఆయిల్ సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు సుమారు రూ.24, డీజిల్‌పై లీటర్‌కు రూ.30 వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల సవరణ తప్పదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమోదం లభిస్తే లీటర్‌కు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అలాగే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశముందని సమాచారం. 2022 తర్వాత దేశంలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇది తొలి పెద్ద ధరల పెంపు కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
చమురు రవాణాకు అంతరాయం
ఇదే సమయంలో మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో ఒత్తిడి పెరిగింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత్ పలు కీలక చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 36 వేల టన్నుల నుంచి 54వేల టన్నులకు పెంచారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించి కొంత ఉపశమనం కల్పించారు. అలాగే రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచారు. దేశంలోని రిఫైనరీలు కూడా 100శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
వివరాలు
అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది
చమురు సంస్థల ఆర్థిక భారం తగ్గించడం, అదే సమయంలో ధరల పెంపుతో ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంధన రంగంలో గత దశాబ్దంలో భారత్ పెద్ద మార్పులు చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. 2014తో పోలిస్తే ఎల్పీజీ టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు అయింది. ముడి చమురు దిగుమతి దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది. ఎథనాల్ మిశ్రమం 1.5 శాతం నుంచి 20 శాతానికి చేరింది. వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా బలోపేతం అయ్యాయి. మొత్తంగా చూస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారిక నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.