iPhone 18 Pro: బ్లింకిట్,జప్టోలో ఆపిల్ లేటెస్ట్ మోడళ్లు.. నగరాల వారీగా డెలివరీ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. దీంతో కొత్త మోడళ్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు అర్ధరాత్రి నుంచే ఆఫ్‌లైన్ స్టోర్ల వద్ద బారులు తీరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో క్విక్ కామర్స్ సంస్థలు బ్లింకిట్, జప్టో పోటాపోటీగా కొత్త ఐఫోన్ మోడళ్లను వినియోగదారుల ఇంటికే చేర్చేందుకు సిద్ధమయ్యాయి.
వివరాలు
బ్లింకిట్‌లో ఏయే ఉత్పత్తులు?
బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 18 ప్రో నాలుగు రంగుల్లో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఆపిల్ వాచ్ ఎస్ 12, ఎయిర్‌పాడ్స్ 5 కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈఓ అల్బీందర్ దిండ్సా తెలిపారు.
ఆర్డర్ చేసిన కొద్దిసేపటికే వీటిని డెలివరీ చేసే సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, జైపుర్, లఖ్‌నవూ నగరాల్లోని వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తుందని వెల్లడించారు.
అయితే, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఎంతనేది బ్లింకిట్ స్పష్టం చేయలేదు.
వివరాలు
జప్టోలోనూ కొత్త ఐఫోన్ మోడళ్లు
మరో క్విక్ కామర్స్ సంస్థ జప్టో కూడా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ 5ను ఇంటికే డెలివరీ చేస్తామని ప్రకటించింది.
దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
ఐఫోన్ 18 ప్రో మోడళ్లపై యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి గరిష్ఠంగా రూ.7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నట్లు జప్టో పేర్కొంది.
దీంతో కొత్త ఐఫోన్ మోడళ్లను వేగంగా, ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ క్విక్ కామర్స్ సేవలు ఉపయోగపడనున్నాయి.