Loading...
Boeing: భద్రతా నిబంధనల ఉల్లంఘన.. బోయింగ్‌కు రూ.3.1 మిలియన్ల జరిమానా
భద్రతా నిబంధనల ఉల్లంఘన.. బోయింగ్‌కు రూ.3.1 మిలియన్ల జరిమానా

Boeing: భద్రతా నిబంధనల ఉల్లంఘన.. బోయింగ్‌కు రూ.3.1 మిలియన్ల జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు 3.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. బోయింగ్‌ ఈ జరిమానాను 2026 జనవరిలోనే చెల్లించినప్పటికీ.. ఈ విషయం ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడికాలేదని రాయిటర్స్‌ తెలిపింది. 2024లో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్‌ 9 విమానంలో గాల్లోనే అత్యవసర పరిస్థితి ఏర్పడిన ఘటనకు సంబంధించిన సంస్థ చర్యలు కూడా జరిమానా విధించడానికి కారణాల్లో ఒకటిగా ఎఫ్‌ఏఏ పేర్కొంది.

వివరాలు 

భద్రతా అధికారుల స్వతంత్రతకు బోయింగ్‌ ఆటంకం

భద్రతా వ్యవహారాలను పరిశీలించే అధికారుల స్వతంత్రతకు బోయింగ్‌ ఆటంకం కలిగించిందని ఎఫ్‌ఏఏ తెలిపింది.

అనుమతించడానికి అర్హత లేని రెండు విమానాలను కూడా తమ పరిశీలనకు బోయింగ్‌ తీసుకొచ్చిందని వెల్లడించింది.

2023 సెప్టెంబర్‌ నుంచి 2024 ఫిబ్రవరి వరకు బోయింగ్‌ 737 విమానాల తయారీ కేంద్రం ఉన్న వాషింగ్టన్‌లోని రెంటన్‌లో, అప్పటి బోయింగ్‌ కాంట్రాక్టర్‌ స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్‌కు చెందిన కాన్సాస్‌లోని విచిటా ఫ్యూజ్‌లేజ్‌ తయారీ కేంద్రంలో నాణ్యతా వ్యవస్థకు సంబంధించి పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఎఫ్‌ఏఏ పేర్కొంది.

వివరాలు 

అర్హత లేని విమానానికి ఆమోదం ఇవ్వాలని ఉద్యోగిపై ఒత్తిడి

ఎఫ్‌ఏఏ విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిపై బోయింగ్‌కు చెందిన మరో ఉద్యోగి ఒత్తిడి తెచ్చినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.

737 మ్యాక్స్‌ విమానం నిబంధనలకు అనుగుణంగా లేదని ఆ ఉద్యోగి గుర్తించినప్పటికీ.. సంస్థ నిర్దేశించిన డెలివరీ గడువును అందుకోవడానికి విమానానికి ఆమోదం ఇవ్వాలని అతడిపై ఒత్తిడి తెచ్చినట్లు ఎఫ్‌ఏఏ తెలిపింది.

బోయింగ్‌ కార్యకలాపాల్లో నిబంధనల అమలు, భద్రత విషయంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

'ఈ జరిమానా సరిపోదు'

ఎఫ్‌ఏఏ విధించిన జరిమానాపై డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన అమెరికా సెనేటర్‌ రిచర్డ్‌ బ్లూమెంతల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ జరిమానా బోయింగ్‌కు పెద్దగా ప్రభావం చూపదని విమర్శించారు.

ఇలాంటి జరిమానాలను బోయింగ్‌ వ్యాపారంలో సాధారణ ఖర్చుగా భరించగలదని, ప్రమాదకరమైన చర్యలను అడ్డుకునేంత ప్రభావం దీనికి లేదని అన్నారు.

గతంలోనూ బోయింగ్‌ భద్రతా సమస్యలపై బ్లూమెంతల్‌ దర్యాప్తు చేశారు.

అలాస్కా ఎయిర్‌లైన్స్‌ విమానంలో గాల్లోనే క్యాబిన్‌ భాగం ఊడిపోయిన ఘటనపై విచారణ జరిపిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు.

బోయింగ్‌ తయారీ ప్రక్రియపై ఉద్యోగులు వ్యక్తం చేసిన ఆందోళనలను కూడా ఆ కమిటీ పరిశీలించింది.

ADVERTISEMENT

వివరాలు 

అలాస్కా ఎయిర్‌లైన్స్‌ ఘటనతో బోయింగ్‌ ప్రతిష్ఠకు దెబ్బ

అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్‌ 9 విమానంలో కీలకమైన నాలుగు బోల్ట్‌లు లేకపోవడంతో గాల్లోనే క్యాబిన్‌ భాగం ఊడిపోయిన ఘటన బోయింగ్‌ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది.

ఈ ఘటన తర్వాత మ్యాక్స్‌ 9 విమానాలను కొంతకాలం నిలిపివేశారు.

అంతేకాకుండా 737 మ్యాక్స్‌ విమానాల ఉత్పత్తిని నెలకు 38 విమానాలకు పరిమితం చేస్తూ ఎఫ్‌ఏఏ ఆంక్షలు విధించింది. అయితే ఈ పరిమితిని 2025 అక్టోబర్‌లో ఎత్తివేసింది.

ADVERTISEMENT