SIM card misuse: నకిలీ పత్రాలతో సిమ్ కొనుగోలు, సిమ్ అప్పగింత నేరం : డాట్ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
సిమ్ కార్డులను ఎడాపెడా కొనుగోలు చేసి వాడకపోయినా, తెలిసిన వ్యక్తులకు ఇవ్వడమో, మూలన పారేయడమో చేసే వారు జాగ్రత్త. ఒకవేళ మీ పేరుతో ఉన్న సిమ్ కార్డు సైబర్ నేరాలకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించినట్లు తేలితే, నేరస్తుడితో పాటు మీరు కూడా బాధ్యత వహించాల్సిందేనని టెలికం శాఖ (DoT) స్పష్టంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ సిమ్ కార్డుల దుర్వినియోగంపై పౌరులను అప్రమత్తం చేసింది. DoT ప్రకారం IMEI ట్యాంపర్ చేసిన మోడెమ్‌లు, మాడ్యూల్స్, సిమ్ బాక్సులను కొనుగోలు చేయడం, ఉపయోగించడం నేరం.
Details
సిమ్ కార్డులను వేరొకరికి ఇవ్వడం కూడా చట్ట విరుద్ధం
అలాగే నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, లేదా మీ పేరుమీద తీసుకున్న సిమ్ కార్డులను వేరొకరికి ఇవ్వడం కూడా చట్ట విరుద్ధం. ఈ విధంగా సిమ్‌ను దుర్వినియోగం చేస్తే, నేరానికి పాల్పడ్డ వ్యక్తితో పాటు అసలు సిమ్ యజమానిపై కూడా సమాన స్థాయి చర్యలు తీసుకోబడతాయని డాట్ స్పష్టం చేసింది. అదే విధంగా కాల్ లైన్ ఐడెంటిటీ (CLI) లేదా టెలికాం గుర్తింపులను మార్చే యాప్‌లు, వెబ్‌సైట్లు వాడకూడదని పౌరులను హెచ్చరించింది.
Details
2023 టెలికమ్యూనికేషన్స్ చట్టం ప్రకారం—
మొబైల్ ఫోన్లు సహా ఏ డివైజ్‌లో అయినా IMEIను ట్యాంపర్ చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. 2024 టెలికమ్యూనికేషన్స్ రూల్స్ ప్రకారం IMEI మార్పు చేసిన డివైజ్‌లను వినియోగించడమే నిషేధితం. పౌరులు తమ డివైజ్ IMEI వివరాలను సంచార్ సాథి పోర్టల్ లేదా యాప్ ద్వారా తప్పక తనిఖీ చేయాలని డాట్ సూచించింది. IMEI ఎంటర్ చేస్తే ఆ డివైజ్‌కు సంబంధించిన బ్రాండ్ పేరు, మోడల్, తయారీ వివరాలు కనిపిస్తాయి. టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నివారించి, దేశవ్యాప్తంగా సురక్షిత టెలికమ్యూనికేషన్ వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కఠినమైన తనిఖీలు, పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేస్తున్నట్లు డాట్ వెల్లడించింది.