Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'
ప్రపంచంలో అగ్రశ్రేణి అకౌంటింగ్ సంస్థగా ఉన్న డెలాయిట్ భారతదేశంలోని కార్యకలాపాల ద్వారా 2030 నాటికి తన ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచి $5 బిలియన్లు (సుమారు ₹40,000 కోట్లు) లక్ష్యంగా పెట్టుకుంది. డెలాయిట్ దక్షిణాసియా CEO రోమల్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డెలాయిట్ ఇండియా ఆదాయం ₹10,000 కోట్లు చేరుకోగా, ఇది 30% వృద్ధిని సూచిస్తోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వృత్తిపరమైన సేవల సంస్థగా డెలాయిట్ ఎదుగుతోందని శెట్టి పేర్కొన్నారు.
గతేడాది 25వేల మందిని నియమించుకున్న డెలాయిట్
2027 నాటికి తమ ఆదాయం ₹20,000 కోట్లు చేరాలనే ఉద్దేశంతో ఉన్నామని, 2030 నాటికి దాన్ని $5 బిలియన్లకు పెంచడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ ఆదాయంలో 10% వృద్ధికి, ఆసియా పసిఫిక్ వృద్ధిలో 70% వాటాకు డెలాయిట్ ఇండియా సహకరిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెలాయిట్ గ్లోబల్ ఆదాయం 3.6% పెరిగి $67.2 బిలియన్ల (సుమారు ₹5 లక్షల కోట్లు)కు చేరుకుంది. డెలాయిట్ ఇండియా 2023-24లో ఉద్యోగుల అట్రిషన్ రేటును 29% నుండి 13%కి తగ్గించుకోగలిగిందని శెట్టి వివరించారు. ఇది 'బిగ్ ఫోర్' సంస్థల సగటు అట్రిషన్ రేటు 20% కంటే తక్కువగా ఉందని, గత ఏడాదిలో డెలాయిట్ ఇండియా 25,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నారు.