Byju's: 1.2బిలియన్ డాలర్ల రుణాన్ని 6నెలల్లో చెల్లించేందుకు సిద్ధమవుతున్న బైజూస్
చట్టపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మొత్తం బకాయి ఉన్న 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్‌ను ఆరు నెలల స్వల్ప వ్యవధిలో పూర్తిగా తిరిగి చెల్లించాలని నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ మేరకు రుణదాతల వద్ద ఈ ప్రతిపాదనను బైజూస్ తెచ్చినట్లు వెల్లడించింది. బైజూస్- రుణదాతల మధ్య బకాయిల చెల్లింపు వివాదం ఏడాది కాలంగా నడుస్తోంది. రానురాను ఈ సమస్య సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండు విడతులుగా చెల్లించేందుకు ప్రతిపాదన
మొదటి మూడు నెలల్లో 300 మిలియన్ డాలర్లను చెల్లించి, తర్వాత మూడు నెలల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదనను రుణదాతల వద్ద బైజూస్ ఉంచినట్లు బ్లూమ్‌బెర్గ్ రాసుకొచ్చింది. రుణదాతలు ప్రస్తుతం బైజూస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అయితే బ్లూమ్‌బెర్గ్ నివేదికపై బైజూస్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అంతేకాకుండా, అసలు కంపెనీకి ఎంత మొత్తం రుణం ఉందనే విషయం కూడా ఇంకా బహిర్గతం కాలేదు. 2015లో బైజూ రవీంద్రన్ ఈ సంస్థను స్థాపించారు. బైజూస్‌ను భారతదేశం వెలుపల విస్తరించాలనే లక్ష్యంతో 2022లో ఐదేళ్ల టర్మ్ లోన్‌ను సంస్థ పెంచింది. దీంతో ఈ కంపెనీ భారతదేశపు అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది.