LOADING...
Anil Ambani: జై అంబానీపై సీబీఐ కేసు నమోదు - రూ.228 కోట్ల మోసం ఆరోపణలు
జై అంబానీపై సీబీఐ కేసు నమోదు - రూ.228 కోట్ల మోసం ఆరోపణలు

Anil Ambani: జై అంబానీపై సీబీఐ కేసు నమోదు - రూ.228 కోట్ల మోసం ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనిల్ అంబానీ కుటుంబానికి మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228.06 కోట్ల మోసం చేసిన కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేసిందని పీటీఐ నివేదిక తెలిపింది. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థపై కూడా మోసానికి సంబంధించిన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. యూనియన్ బ్యాంక్ (మునుపటి ఆంధ్రా బ్యాంక్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ఆ సంస్థ డైరెక్టర్లు జై అన్మోల్ అంబానీ, రవీంద్ర శరద్ సుధాకర్‌లపై సీబీఐ చర్యలు ప్రారంభించింది.

వివరాలు 

అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన జై అంబానీ

గతంలో బ్యాంకు మోసాల కేసుల్లో అనిల్ అంబానీపై సీబీఐ,ఈడీలు దర్యాప్తు చేసినప్పటికీ, కుమారుడు జై అంబానీపై కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్‌లో యెస్ బ్యాంక్-రిలయన్స్ గ్రూప్ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ నిప్పాన్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జై అంబానీ పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. అలాగే రిలయన్స్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ నిర్ణయ ప్రక్రియలో అనిల్ అంబానీ,జై అంబానీలు జోక్యం చేసుకున్నారని,జై అంబానీ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టు కూడా గతంలో వెల్లడించింది. తాజా కేసులో,ముంబైలోని బ్యాంక్ ఎస్సీఎఫ్ శాఖ నుంచి వ్యాపార అవసరాల కోసం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సుమారు రూ.450 కోట్ల క్రెడిట్ లిమిట్ తీసుకున్నట్లు ఫిర్యాదులో ఉంది.

వివరాలు 

ఎన్‌పీఏగా 2019 సెప్టెంబర్ 30న ఆ ఖాతా

సకాలంలో వాయిదాలు చెల్లించడం, వడ్డీ చెల్లింపులు, భద్రత వివరాలు సమర్పించడం, అమ్మకాల మొత్తం బ్యాంక్ ఖాతా ద్వారానే మళ్లించడం వంటి షరతులు పాటించాల్సి ఉండగా, అవి అమలు చేయలేదని బ్యాంక్ పేర్కొంది. దాంతో 2019 సెప్టెంబర్ 30న ఆ ఖాతాను ఎన్‌పీఏగా ప్రకటించింది. 2016 ఏప్రిల్ 1 నుంచి 2019 జూన్ 30 వరకూ గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా, అప్పుగా తీసుకున్న నిధులను తప్పుడు మార్గాల్లో వినియోగించారని, అది నిధుల మళ్లింపుగా భావించాల్సిన పరిస్థితి ఉందని వెల్లడైంది. అప్పటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఖాతాల తారుమారు, నమ్మకద్రోహం ద్వారా మోసపూరితంగా నిధులను దుర్వినియోగం చేసి, మంజూరైన ఉద్దేశానికి కాకుండా ఇతర అవసరాలకు మళ్లించారని యూనియన్ బ్యాంక్ ఆరోపణ చేసింది.

Advertisement