Loading...
India's GDP: జీడీపీపై విపక్షాల విమర్శలు.. కొత్త మెథడాలజీని వివరించిన సీఈఏ
జీడీపీపై విపక్షాల విమర్శలు.. కొత్త మెథడాలజీని వివరించిన సీఈఏ

India's GDP: జీడీపీపై విపక్షాల విమర్శలు.. కొత్త మెథడాలజీని వివరించిన సీఈఏ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రం ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికం (Q1) జీడీపీ గణాంకాలపై కొందరు విశ్లేషకులు వ్యక్తం చేసిన సందేహాలకు ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్‌ సమాధానమిచ్చారు. జీడీపీ వృద్ధిపై వస్తున్న విమర్శలకు గణాంకాల ఆధారంగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

వివరాలు 

గత ఏడాది లెక్కలతో పోల్చడం సరికాదు

గత ఆర్థిక సంవత్సరం (FY26) తొలి త్రైమాసిక జీడీపీని 2011-12ను ప్రాతిపదికగా తీసుకున్న పాత విధానంలో కొందరు రూ.86 లక్షల కోట్లుగా లెక్కించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసిక జీడీపీని 2022-23 బేస్‌ ఇయర్‌గా తీసుకున్న కొత్త విధానంలో రూ.88 లక్షల కోట్లుగా లెక్కించారు.

ఈ రెండు గణాంకాలను నేరుగా పోల్చడం వల్లే కొందరు విమర్శకులు వృద్ధి రేటు కేవలం 2-2.3 శాతమేనని చెబుతున్నారని నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.

అయితే, రెండు వేర్వేరు విధానాల్లో లెక్కించిన గణాంకాలను నేరుగా పోల్చడం సరికాదని స్పష్టం చేశారు.

వివరాలు 

పాత గణాంకాలను కొత్త విధానంలో లెక్కించాలి

గత ఏడాది తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలను కూడా కొత్త విధానంలో తిరిగి లెక్కించి, ఆ తర్వాత ప్రస్తుత ఏడాది గణాంకాలతో పోల్చాలని సీఈఏ వివరించారు.

పాత సిరీస్‌ కొనసాగి ఉంటే, కొత్త మెథడాలజీ ప్రకారం FY26 Q1 జీడీపీ రూ.86 లక్షల కోట్ల కంటే ఎక్కువగా, దాదాపు రూ.90 లక్షల కోట్లకు చేరి ఉండేదని ఆయన అంచనా వేశారు.

అలా సవరించిన గత ఏడాది గణాంకంతో ప్రస్తుత ఏడాది రూ.88 లక్షల కోట్ల జీడీపీని పోల్చినప్పుడే వాస్తవికమైన, న్యాయమైన వృద్ధి రేటు తెలుస్తుందని చెప్పారు.

అంతేకానీ, భిన్నమైన కొలమానాలతో వచ్చిన రెండు అంకెలను నేరుగా పోల్చి వృద్ధిని అంచనా వేయడం సరైన పద్ధతి కాదన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అనేక కారణాలతో గణాంకాల్లో మార్పులు

గత ఏడాది జీడీపీ గణాంకాల్లో వచ్చిన మార్పులకు కేవలం డబుల్‌ డిఫ్లేటర్‌ విధానమే కారణం కాదని నాగేశ్వరన్‌ తెలిపారు.

మెరుగైన కార్యనిర్వహణ, అసంఘటిత రంగానికి మరింత విస్తృతమైన కవరేజీ వంటి పలు అంశాలు కూడా ఇందుకు కారణమని వివరించారు.

కొత్త విధానంలో FY26 గణాంకాలు పెరగకపోవడం కూడా గతంలోనే ఆర్థిక వ్యవస్థను సరైన స్థాయిలో కవర్‌ చేశామనడానికి ఒక సూచనగా ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

డిఫ్లేటర్‌ అంటే ఏమిటి?

జీడీపీని లెక్కించేటప్పుడు నామినల్‌ జీడీపీ, అంటే ధరల మార్పుల ప్రభావంతో కూడిన గణాంకం నుంచి రియల్‌ జీడీపీని గుర్తించాలి.

రియల్‌ జీడీపీ అంటే ధరల ప్రభావాన్ని తొలగించిన తర్వాత ఉత్పత్తి వాస్తవంగా ఎంత పెరిగిందో చూపించే గణాంకం.

ఇందుకోసం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపయోగించే సాధనాన్నే 'డిఫ్లేటర్‌' అంటారు.

వివరాలు 

అంతర్జాతీయ సంస్థల సూచనలతోనే డబుల్‌ డిఫ్లేటర్‌ విధానం తీసుకోలేదు

డబుల్‌ డిఫ్లేటర్‌ పద్ధతిని కేవలం అంతర్జాతీయ సంస్థల సూచనల మేరకే భారత్‌ అనుసరిస్తోందన్న వాదనను నాగేశ్వరన్‌ తోసిపుచ్చారు.

గణాంక నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ విధానాన్ని ఎంచుకున్నామని తెలిపారు.

ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ ధరలు వేర్వేరు కారణాల వల్ల మారుతుంటాయని, అందువల్ల వాటి ధరల ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడానికి డబుల్‌ డిఫ్లేటర్‌ పద్ధతి సరైనదని వివరించారు.

వివరాలు 

7.8 శాతం వృద్ధి.. ముందే కనిపించిన సంకేతాలు

దేశ ఆర్థిక వ్యవస్థ నమోదు చేసిన 7.8 శాతం వృద్ధి రేటు అకస్మాత్తుగా వచ్చినది కాదని నాగేశ్వరన్‌ స్పష్టం చేశారు.

దీనికి ముందే పలు నెలవారీ ఆర్థిక సూచికలు బలమైన వృద్ధి సంకేతాలను ఇచ్చాయని తెలిపారు.

జీఎస్టీ వసూళ్లు, ఈ-వే బిల్లుల జారీ, వాహన విక్రయాలు, ఎగుమతుల వృద్ధి, బ్యాంకు రుణాల పెరుగుదల వంటి సూచికలు ఆర్థిక కార్యకలాపాల్లో వేగాన్ని ముందుగానే సూచించాయని పేర్కొన్నారు.

ఈ వివరాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), కస్టమ్స్‌, ప్రభుత్వ ఖజానా వంటి విశ్వసనీయ వనరుల నుంచి సేకరించినవేనని చెప్పారు.

వివరాలు 

ఉద్యోగాల కల్పనపై ఏమన్నారంటే..

ఉద్యోగాల కల్పన అంశంపైనా నాగేశ్వరన్‌ స్పందించారు. కొవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పన పెద్ద సవాలుగా మారిందని అన్నారు.

అయితే ఉద్యోగాలపై ప్రభావం చూపే అంశాలు ఒక్కటే కావని, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, స్వచ్ఛందంగా ఉద్యోగం చేయకూడదనే నిర్ణయం వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని వివరించారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగాల వృద్ధికి సంబంధించిన ధోరణులు మెరుగ్గా ఉన్నాయని నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT