LPG: ఎల్‌పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా, ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సోమవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఒకసారి సిలిండర్ బుక్ చేయడానికి 55 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని, అయితే ఇటీవల కొందరు వినియోగదారులు కేవలం 15 రోజులకే మళ్లీ బుకింగ్ చేస్తున్న ఘటనలు గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బుకింగ్ వ్యవధిని పెంచినట్లు తెలిపారు.
Details
దేశంలోని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ
అదే సమయంలో ఎల్‌పీజీ ఉత్పత్తిని వేగవంతం చేయాలని దేశంలోని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ కనెక్షన్ల కంటే గృహ వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కొత్త ఎల్‌పీజీ సరఫరా దేశాలను కూడా అన్వేషిస్తోంది. ఇప్పటికే అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు భారత్‌కు ఎల్‌పీజీ సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇంధన ధరల విషయంలో మాత్రం తక్షణ ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Details
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చు
ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 130డాలర్ల మార్కును దాటితే తప్ప దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం భారత్ వద్ద తగినంత చమురు నిల్వలు ఉన్నందున ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 100 డాలర్ల వద్దనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని ఏ పెట్రోల్ బంక్‌లోనూ ఇంధన కొరత లేదని కూడా వారు వెల్లడించారు. భారత్‌కు ప్రధానంగా హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే ముడి చమురు దిగుమతులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఆ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను వేగవంతం చేసే చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Details
ఎలాంటి ఆందోళన అవసరం లేదు
విమాన ఇంధనం (ఏటీఎఫ్) విషయంలో కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. భారత్‌లో ఏటీఎఫ్ ఉత్పత్తి మాత్రమే కాకుండా ఎగుమతి కూడా జరుగుతున్నందున సరఫరాపై ప్రభావం ఉండదని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇంధన భద్రత విషయంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని కూడా పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక దశలో బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల సమీపానికి చేరుకుంది. ప్రస్తుతం కొంత తగ్గినా బ్యారెల్ ధర 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరువర్గాలు చమురు కేంద్రాలపై దాడులు కొనసాగించడంతో ధరలు మరింత పెరుగుతున్నాయి.
Details
చమురు ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం అంటే రోజుకు దాదాపు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధి గుండా ప్రస్తుతం షిప్పింగ్ దాదాపు నిలిచిపోయింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల భయంతో ఆయిల్ ట్యాంకర్లు ముందుకు సాగడానికి వెనుకాడుతున్నాయి. ఫలితంగా ఎగుమతులు నిలిచిపోవడంతో స్టోరేజ్ ట్యాంకులు నిండిపోయి ఇరాక్, కువైట్, యూఏఈ దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చమురు ధరలను నియంత్రించేందుకు జీ7దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. అయితే ఇవి కొద్ది వారాలపాటు మాత్రమే ఉపశమనం కలిగించవచ్చని,యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Details
ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రభావం
చమురు ధరల పెరుగుదల ప్రభావం ఇప్పటికే ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. ముడి చమురుతో పాటు సహజ వాయువు ధరలు కూడా పెరగడంతో జపాన్, యూరప్, అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య చమురుపైనే ఆధారపడిన ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఈ పరిస్థితి పెద్ద సవాలుగా మారుతోంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100డాలర్ల పైనే కొనసాగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రోజుకు 16లక్షల బ్యారెళ్ల చమురును ప్రధానంగా చైనాకు ఎగుమతి చేసే ఇరాన్ ఇప్పుడు ఆ సరఫరా చేయలేకపోతే చైనా ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సి వస్తుంది. ఇది ఇంధన ధరలను మరింత పెంచే అవకాశం ఉంది.
Details
ఇందన ధరలు వేగంగా పెరిగే అవకాశం
అమెరికాలో కూడా ఇంధన ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం ఒకవారం వ్యవధిలోనే అక్కడ పెట్రోల్ ధర గ్యాలన్‌కు 47 సెంట్లు పెరిగి 3.45డాలర్లకు చేరుకుంది. డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇప్పుడిప్పుడే ఇంధన సంక్షోభం నుంచి కోలుకుంటున్న యూరప్ దేశాలను తాజా చమురు, సహజ వాయువు ధరల పెరుగుదల మళ్లీ మాంద్యం అంచుకు తీసుకెళ్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుపై పడుతోంది. ఈ పరిస్థితి త్వరగా ముగియకపోతే రాబోయే రోజుల్లో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల జీవన వ్యయం మరింత భారంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.