LOADING...
Narendra Modi: ఒకే గొడుగు కింద బీమా కంపెనీలు… కేంద్రం కొత్త నిర్ణయానికి రంగం సిద్ధం
ఒకే గొడుగు కింద బీమా కంపెనీలు… కేంద్రం కొత్త నిర్ణయానికి రంగం సిద్ధం

Narendra Modi: ఒకే గొడుగు కింద బీమా కంపెనీలు… కేంద్రం కొత్త నిర్ణయానికి రంగం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది. ఇప్పటివరకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి పంపిన మోదీ సర్కారు,ఇప్పుడు బీమా రంగంపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు ప్రధాన బీమా కంపెనీలు ఉన్నాయి. ఓరియెంటల్ ఇన్సూరెన్స్,నేషనల్ ఇన్సూరెన్స్,యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. ఈ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్రం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా,విడివిడిగా నడుస్తున్న ఈ మూడు కంపెనీలను ఒకే సంస్థగా విలీనం చేసే దిశలో ప్రభుత్వం మళ్లీ ఆలోచనలు ప్రారంభించింది. మూడు సంస్థలు వేర్వేరుగా పనిచేయడం వల్ల ఆర్థికంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని,అలాగే ఇవి ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున,ఒకటిగా మార్చితే స్థిరత్వం వస్తుందని కేంద్రం భావిస్తోంది.

వివరాలు 

బీమా కంపెనీని ప్రైవేట్ రంగానికి అప్పగించే అవకాశాలు 

ఇది కొత్త ఆలోచన కాదు. 2018-19 బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇదే విలీన ప్రతిపాదనను ప్రకటించారు. అయితే 2020 జూలై నాటికి ఆ నిర్ణయం పక్కన పడిపోయింది. తర్వాత ఈ కంపెనీల పరిస్థితి మరింత దిగజారడంతో, వాటిని నిలబెట్టేందుకు ప్రభుత్వం రూ.12,540 కోట్ల మూలధనాన్ని అందించింది. తాజాగా ఆర్ధిక పరిస్థితులు కొంచెం మెరుగైందని భావించిన కేంద్రం, మళ్లీ పాత విలీన ప్రతిపాదనను ముందుకు తెస్తోంది. అంతేకాదు, ఈ మూడు సంస్థలను ఒకటిగా మార్చడమే కాక, వాటిలో ఒక బీమా కంపెనీని ప్రైవేట్ రంగానికి అప్పగించే అవకాశాలపై కూడా దృష్టి పెట్టుతోంది. 2021లో పార్లమెంట్ ఆమోదించిన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ చట్టం ఇందుకు మార్గం సులువు చేసింది.

వివరాలు 

విదేశీ పెట్టుబడులకు కొత్త మార్గాలు

బీమా రంగంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, విదేశీ పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచే బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దానికి ముందుగా ప్రభుత్వ రంగ బీమా సంస్థలన్నింటినీ ఒకే గొడుగుకింద చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019-20 నుంచి 2021-22 మధ్య ఈ మూడు కంపెనీల్లో కేంద్రం మొత్తం రూ.17,540 కోట్ల పెట్టుబడి పెట్టింది. అంతేకాక, కనీసం 51 శాతం వాటా ప్రభుత్వ చేతిలో ఉండాలనే పాత నిబంధనను చట్టపరంగా తొలగించడంతో, విదేశీ పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి.