
Starlink: భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం కఠిన షరతులు.. వాటికి అంగీకరిస్తేనే సేవలు అందుబాటులోకి..
ఈ వార్తాకథనం ఏంటి
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X (SpaceX) సంస్థతో భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ నేపథ్యంలో, త్వరలో భారత్‌లో స్టార్‌లింక్ (Starlink) సేవలు ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.
అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
భారత్‌లో ఈ సేవలను ప్రారంభించాలంటే,దేశీయంగా ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా ఓ జాతీయ మీడియా నివేదిక వెల్లడించింది.
వివరాలు
కమ్యూనికేషన్ వ్యవస్థను నియంత్రించేందుకు అవకాశం
ముఖ్యంగా, సున్నితమైన,సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహించడం, అవసరమైతే నియంత్రణ కలిగి ఉండడం కోసం దేశంలోని ఒక కంట్రోల్ సెంటర్ ఉండాల్సిందేనని ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం.
ఈ సెంటర్ వల్ల భద్రతా కారణాల రీత్యా తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
"శాంతిభద్రతల పరిస్థితులు తీవ్రతరమైతే, అమెరికాలోని స్టార్‌లింక్ ప్రధాన కార్యాలయంపై ఆధారపడకుండా, స్వదేశంలోనే చర్యలు తీసుకునే స్వయం సమర్థత అవసరం" అని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
అంతేకాక,విపత్తు నిర్వహణ,ప్రజాస్వామిక భద్రత వంటి అత్యవసర సందర్భాల్లో, ప్రభుత్వ అనుమతితో దర్యాప్తు సంస్థలు అవసరమైన మేరకు కమ్యూనికేషన్ వ్యవస్థను నియంత్రించేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది.
వివరాలు
శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం కేంద్ర ప్రభుత్వానికి స్టార్‌లింక్ దరఖాస్తు
ప్రస్తుతానికి భారతీయ టెలికాం సంస్థలు, జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా వంటి నెట్‌వర్క్‌లు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిబంధనల పట్ల స్టార్‌లింక్ సంస్థ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తమ అభిప్రాయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అనుమతుల కోసం ఇప్పటికే స్టార్‌లింక్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
అయితే, దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించాల్సి ఉంది.
మరోవైపు, భారతీ ఎయిర్‌టెల్, జియో సంస్థలు ఈ సేవలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తేనేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి.