LOADING...
China: చైనా పరిశ్రమలకు సానుకూల సంకేతాలు.. వరుసగా ఆరో నెల వృద్ధి
చైనా పరిశ్రమలకు సానుకూల సంకేతాలు.. వరుసగా ఆరో నెల వృద్ధి

China: చైనా పరిశ్రమలకు సానుకూల సంకేతాలు.. వరుసగా ఆరో నెల వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా తయారీ రంగం మే నెలలో వరుసగా ఆరో నెల కూడా వృద్ధిని నమోదు చేసింది. అయితే ఈ వృద్ధి గత నెలతో పోలిస్తే కొంత మందగించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ విడుదల చేసిన రేటింగ్‌డాగ్ చైనా జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) ఏప్రిల్‌లో 52.2గా ఉండగా, మేలో 51.8కు తగ్గింది. అయినప్పటికీ ఇది విశ్లేషకులు అంచనా వేసిన 51.6 కంటే స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. రేటింగ్‌డాగ్ వ్యవస్థాపకుడు యావో యూ మాట్లాడుతూ,మే నెలలో కూడా తయారీ రంగం వృద్ధి కొనసాగిందని,అయితే గతంతో పోలిస్తే వృద్ధి వేగం కొంత తగ్గిందని తెలిపారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయాలు, ధరల నిర్వహణలో సంస్థలకు కొంత ఊరట లభించిందన్నారు.

వివరాలు 

ఐదు నెలల తర్వాత తొలిసారిగా తగ్గుముఖం పట్టిన కోత్త ఎగుమతి ఆర్డర్లు

ఇదే సమయంలో ఆదివారం విడుదలైన అధికారిక నివేదికలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు దాదాపు స్థిరంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రైవేట్ సర్వే ప్రకారం ఉత్పత్తి వరుసగా ఆరో నెల పెరిగింది. ముఖ్యంగా పెట్టుబడి వస్తువుల విభాగం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, కొత్త ఆర్డర్లు రావడం,ఉత్పత్తుల మెరుగుదల,కొత్త వ్యాపార అవకాశాలు లభించడం వల్ల ఉత్పత్తి పెరిగినట్లు సంస్థలు పేర్కొన్నాయి. కొత్త ఆర్డర్లు వరుసగా 12వ నెల కూడా పెరిగినప్పటికీ, ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి రేటు తగ్గింది. అయితే కొత్త ఎగుమతి ఆర్డర్లు ఐదు నెలల తర్వాత తొలిసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా వస్తువులపై డిమాండ్ ప్రభావితమవుతోందనే సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

మూడు నెలల కనిష్ఠ స్థాయికి ముడిసరుకు వ్యయాల పెరుగుదల

మే నెలలో ముడిసరుకు ఖర్చులు, ఉత్పత్తి ధరలపై ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా తగ్గినట్లు సర్వే వెల్లడించింది. ముడిసరుకు వ్యయాల పెరుగుదల మూడు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. పెట్టుబడి వస్తువుల రంగంలో వ్యయాలు ఎక్కువగా పెరగగా, వినియోగ వస్తువుల విభాగంలో పెరుగుదల అత్యల్పంగా నమోదైంది. ఉత్పత్తి ధరల పెరుగుదల కూడా కొంత తగ్గినా, దీర్ఘకాల సగటు కంటే ఇంకా ఎక్కువగానే ఉంది. మధ్యంతర వస్తువుల తయారీదారులు ధరలను వేగంగా పెంచగా, వినియోగ వస్తువుల కంపెనీలు అత్యల్ప స్థాయిలో ధరలను పెంచాయి.

Advertisement

వివరాలు 

ఆరో నెల కూడా ఎగుమతి ధరలను పెంచిన చైనా తయారీ సంస్థలు

ఇక చైనా తయారీ సంస్థలు వరుసగా ఆరో నెల కూడా ఎగుమతి ధరలను పెంచాయి. అయితే ఈ పెరుగుదల ఏప్రిల్‌తో పోలిస్తే మందగించింది. ఆర్డర్ల పెరుగుదల, సరఫరా ఆలస్యాల కారణంగా పెండింగ్ పనులు వరుసగా నాలుగో నెల కూడా పెరిగాయి. మరోవైపు ఉద్యోగాల సంఖ్య ఐదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఉపాధి సూచీ 50 మార్క్ కంటే దిగువన నమోదవడంతో ఉద్యోగుల నియామకాలు తగ్గుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Advertisement