Cloudflare : ఏఐ ప్రభావం.. క్లౌడ్‌ఫ్లేర్‌లో 1,100 మందికి పైగా తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సైబర్ భద్రత సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ఆధారిత కొత్త యుగానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం సిబ్బందిలో సుమారు 20 శాతానికి సమానం. గురువారం తొలి త్రైమాసిక ఆదాయ వివరాలను వెల్లడించిన అనంతరం ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయం ఖర్చుల నియంత్రణ కోసం తీసుకున్నది కాదని సంస్థ స్పష్టం చేసింది. ఏఐ ఆధారిత మార్పులకు అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యమని సహ వ్యవస్థాపకులు మాథ్యూ ప్రిన్స్, మిషెల్ జాట్లిన్ ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. గత మూడు నెలల్లోనే సంస్థలో ఏఐ వినియోగం 600 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు.
వివరాలు
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి కోతలు ఉండవని హామీ
ఇంజినీరింగ్, మానవ వనరులు, ఆర్థిక విభాగాలతో పాటు అన్ని విభాగాల్లో వేల సంఖ్యలో కృత్రిమ మేధ ఆధారిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంస్థ నిర్మాణంలో మార్పులు తప్పనిసరి అయ్యాయని వివరించారు. ఉద్యోగాల కోత ప్రక్రియ ప్రస్తుతం ఒకేసారి పూర్తవుతుందని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలు ఉండవని యాజమాన్యం హామీ ఇచ్చింది. పదేపదే చిన్న చిన్న కోతలు విధిస్తే ఉద్యోగుల్లో అనిశ్చితి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏఐ ఆధారిత ప్రపంచంలో ఉన్నత స్థాయి సంస్థ ఎలా పనిచేయాలన్న దానికి కొత్త ప్రమాణాలు ఏర్పరచడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులకు పరిశ్రమలో అత్యుత్తమ సదుపాయాలతో కూడిన పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించింది.