Credit Card Bill: క్రెడిట్ కార్డు వినియోగదారు మరణిస్తే అప్పు ఎవరు చెల్లించాలి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం చాలా మంది తమ అత్యవసర ఖర్చులు, అదనపు ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డును ఎలా వినియోగించాలి, అప్పు చెల్లింపుల విషయంలో ఏ నియమాలు వర్తిస్తాయనే విషయాలపై చాలామందికి పూర్తి అవగాహన ఉండదు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారు మరణిస్తే ఆ బాకీ పరిస్థితి ఏమవుతుందనే సందేహం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే చాలా రుణాలకు పూచీకత్తు అవసరం ఉంటుంది. బంగారు రుణానికి నగలు,గృహ రుణానికి ఇల్లు వంటి ఆస్తులు భద్రతగా ఉంటాయి. కానీ క్రెడిట్ కార్డు అప్పులకు మాత్రం ఎలాంటి పూచీకత్తు ఉండదు.అందువల్ల ఆ కార్డు ఎవరి పేరుపై ఉందో, ఆ వ్యక్తే ఆ బాకీకి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
వివరాలు
యజమాని తీసుకున్న వ్యక్తిగత అప్పుకు వారసులు బాధ్యులను చేసే అధికారం బ్యాంకులకు ఉండదు
క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కార్డు యజమానిదే. ఒకవేళ ఆ వ్యక్తి మరణించినా కూడా ఆ బాకీ పూర్తిగా రద్దు అయిపోదు. అవసరమైతే బ్యాంకులు మరణించిన వ్యక్తి పేరుపై ఉన్న ఆస్తుల ద్వారా బాకీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు అప్పును తప్పనిసరిగా భార్య, భర్త లేదా పిల్లలు చెల్లించాలనే నిబంధన లేదు. కార్డు యజమాని తీసుకున్న వ్యక్తిగత అప్పుకు వారసులను నేరుగా బాధ్యులను చేయడానికి బ్యాంకులకు అధికారం ఉండదు. అందువల్ల జీవిత భాగస్వామి లేదా పిల్లలపై బ్యాంకులు బలవంతంగా ఒత్తిడి చేయలేవు.