Crude oil: ముడిచమురు మంటలు.. రిలయన్స్, ఆయిల్ కంపెనీలకు కష్టకాలమా?
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో వేగంగా ముదురుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ప్రారంభమైన ఈ ఘర్షణ ప్రభావం నేరుగా ముడి చమురు ధరలపై పడుతోంది. భారత్ వంటి భారీ చమురు దిగుమతిదార దేశాలకు ఇది పెద్ద ఆర్థిక సవాల్‌గా మారనుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ పెట్రోలియం ఎగుమతుల్లో సుమారు 20శాతం, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో మరో 20 శాతం వాటా కలిగిన కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ప్రస్తుతం ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో సుమారు 50 శాతం, ఎల్‌ఎన్‌జీలో 54 శాతం ఈ మార్గం ద్వారానే వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు సమాచారం.
Details
ధరలపై ప్రభావం
ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే షిప్పింగ్, బీమా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. బ్రెంట్ క్రూడ్ ధరలు 5-15 శాతం వరకు ఎగబాకవచ్చని అంచనా. ఇప్పటికే బ్యారెల్ ధర 65 డాలర్ల నుంచి 73 డాలర్లకు పెరిగింది. చమురు ధరలు పెరిగితే విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెరిగి కరెంట్ అకౌంట్ లోటు అధికమవుతుంది. రూపాయి విలువ క్షీణించే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోవచ్చు. ఒకవేళ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటితే నిఫ్టీ సూచీలో 3-5 శాతం అస్థిరత కనిపించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Details
చమురు కంపెనీలపై ఒత్తిడి
ICRA నివేదిక ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ ధరలు పెరిగినా దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోతే ఈ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు గణనీయంగా తగ్గిపోతాయి. పెయింట్స్, ఏవియేషన్, కెమికల్ రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Details
రిలయన్స్‌పై మిశ్రమ ప్రభావం
మార్కెట్ నిపుణుడు అభిషేక్ భట్ విశ్లేషణ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి మిశ్రమంగా ఉండవచ్చు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు (GRM) బలంగా ఉంటే శుద్ధి వ్యాపారం లాభపడే అవకాశం ఉంది. అయితే పెట్రోకెమికల్ విభాగంలో ముడి సరుకు ఖర్చులు పెరిగితే లాభాలు తగ్గవచ్చు. రిలయన్స్ రిటైల్, జియో వంటి ఇతర వ్యాపార విభాగాలు చమురు రంగ నష్టాలను కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిలయన్స్ షేరు రూ. 1,394 వద్ద ట్రేడవుతోంది.
Details
ఆర్థిక సవాళ్లు తప్పవా?
యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక ఒత్తిడి పెరగడం ఖాయం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు ఐటీ, ఫార్మా వంటి రక్షిత రంగాల వైపు మళ్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే హార్ముజ్ జలసంధి పరిస్థితులు భారత్‌కు తక్షణ సరఫరా సంక్షోభం కంటే ధరల పెరుగుదల, ఆర్థిక అస్థిరత రూపంలో పెద్ద సవాలుగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.