LOADING...
Oil Prices : వార్‌ ఎఫెక్ట్‌.. మూడున్నరేళ్ల తర్వాత 100 డాలర్ల మార్క్ దాటిన ముడిచమురు

Oil Prices : వార్‌ ఎఫెక్ట్‌.. మూడున్నరేళ్ల తర్వాత 100 డాలర్ల మార్క్ దాటిన ముడిచమురు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. తాజాగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్క్‌ను దాటింది. మూడున్నరేళ్ల తర్వాత ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలో చమురు ధరలకు ప్రమాణంగా భావించే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 106.22 డాలర్లకు చేరింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఇది 90.90 డాలర్లుగా ఉండగా, తాజా ట్రేడింగ్‌లో దాదాపు 16.9 శాతం పెరుగుదల నమోదైంది.

వివరాలు 

రెండో వారంలోకి యుద్ధం

అలాగే షికాగో మెర్కంటైల్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర కూడా భారీగా పెరిగింది. ఇది 16.5 శాతం ఎగిసి బ్యారెల్‌కు 107.97 డాలర్లకు చేరుకుంది. గత వారం అమెరికా క్రూడ్ ధరలు సుమారు 36 శాతం పెరిగితే, బ్రెంట్ క్రూడ్ ధరలు 26 శాతం వరకు పెరిగాయి. ఆ ప్రభావం తాజా ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇజ్రాయెల్-అమెరికా,ఇరాన్ మధ్య యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించింది. ఈ పరిస్థితుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో చమురు ఉత్పత్తి మరియు రవాణా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది.

వివరాలు 

ఇరాన్ హెచ్చరికలు జారీ

మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేశామని, అక్కడి నుంచి నౌకలు వెళ్లేందుకు ప్రయత్నిస్తే దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలక మార్గం. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ మార్గం ద్వారా ప్రపంచం వినియోగించే చమురులో దాదాపు ఐదో వంతు రవాణా అవుతోంది. ప్రస్తుతం ఈ మార్గంలో అంతరాయం ఏర్పడటం వల్ల ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.

Advertisement