Loading...
Binance: బైనాన్స్‌లో హ్యాకింగ్ అనుమానాలు.. 6.3 బిలియన్ డాలర్ల లావాదేవీలపై ప్రభావం
బైనాన్స్‌లో హ్యాకింగ్ అనుమానాలు.. 6.3 బిలియన్ డాలర్ల లావాదేవీలపై ప్రభావం

Binance: బైనాన్స్‌లో హ్యాకింగ్ అనుమానాలు.. 6.3 బిలియన్ డాలర్ల లావాదేవీలపై ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ సంస్థ బైనాన్స్ (Binance) కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ డిపాజిట్లు, విత్‌డ్రాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామంతో సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలపై ప్రభావం పడింది. బైనాన్స్ ప్లాట్‌ఫామ్‌పై హ్యాకింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా సంస్థ వ్యవస్థాపకుడు కూడా ఈ అవకాశాన్ని ప్రస్తావించడంతో క్రిప్టో మార్కెట్‌లో ఆందోళన మొదలైంది. ఈ వార్తల ప్రభావంతో బిట్‌కాయిన్ (Bitcoin) సహా పలు డిజిటల్ టోకెన్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

వివరాలు 

అనుమానాస్పద నిధులు ఫ్రీజ్

ఈ పరిణామంపై బైనాన్స్ స్పందిస్తూ.. సమస్యను పరిష్కరించేందుకు తమ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని వెల్లడించింది.

ఈ ఘటన వల్ల కలిగే నష్టాలన్నింటినీ సంస్థే భరిస్తుందని స్పష్టం చేసింది.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతా విభాగం తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద నిధులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది.

వినియోగదారుల నిధుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

వివరాలు 

బైనాన్స్‌కు 100 దేశాల్లో సుమారు 300 మిలియన్ల మంది రిజిస్టర్డ్ వినియోగదారులు

2017లో చాంగ్‌పెంగ్ జావో బైనాన్స్ సంస్థను స్థాపించారు. 2023లో ఆయన సంస్థ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, ఇప్పటికీ కీలక వాటాదారుగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం బైనాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో సుమారు 300 మిలియన్ల మంది రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్నారు.

తాజా పరిణామం ఎంతమంది ఖాతాదారులపై ప్రభావం చూపిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

మరోవైపు, వినియోగదారుల క్రిప్టో వాలెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీలు లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని బైనాన్స్ వెల్లడించింది.

అయితే, హ్యాకింగ్ అనుమానాలపై స్పష్టత రావాల్సి ఉండటంతో క్రిప్టో మార్కెట్‌లో ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ADVERTISEMENT