స్టాక్ మార్కెట్లో సైయెంట్ డీఎల్ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ల్లో సైయెంట్ డీఎల్ఎం ఐపీఓ అదరహో అనిపించింది. ఈ మేరకు సోమవారం 52 శాతం ప్రీమియంతో రూ. 403 వద్ద ఎన్ఎస్ఈఓ డీఎల్ఎం లిస్టింగ్ జరిగింది. మరోవైపు బీఎస్ఈలో షేర్ విలువ రూ. 401 వద్ద ప్రారంభమైంది. అయితే భారీ లాభాలతో సైయెంట్ డీఎల్ఎం ఐపీఓ లిస్ట్ సందర్భంగా మదుపర్లలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. తమకు అలాట్ అయిన షేర్లు కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది, అమ్మేస్తే లాభాలు ఉంటాయా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కొత్తగా షేర్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా అంటూ మరికొందరు మేథస్సుకు పదునుపెడుతున్నారు. సైయెంట్ డీఎల్ఎంలోతో పాటు ఐడియా ఫోర్జ్ ఐపీఓకు బంపర్ లిస్టింగ్ వచ్చింది.
షేర్లు అమ్మకాలు, కొనుగోలుపై నిపుణుల ఏమంటున్నారు తెలుసా ?
ప్రస్తుతం షేర్ విలువను అమ్ముకోవడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా షేర్లు కొనాలని అనుకునే వారు మాత్రం కాస్త వేచి చూడాలని అంటున్నారు. ఎందుకంటే షేర్ ప్రైజ్ కిందకు దిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాకే మదుపర్లు ఫైనల్ గా ఓ నిర్ణయం తీసుకోవాలని మెహ్తా ఈక్విటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్, సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే సూచించారు. సైయెంట్ డీఎల్ఎం ఐపీఓ సబ్స్క్రిప్షన్ జూన్ 27న ఓపెన్ అయ్యి జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే సైయెంట్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఐపీఓ లిస్టింగ్ భారీ లాభాలతో జరుగుతుందని మార్కెట్ వర్గాలు ముందస్తుగానే అంచనా వేశాయి. అందుకు తగ్గట్టే మార్కెట్ ప్రీమియం తోడైంది.