DA hike delay: డీఏ పెంపుపై నీలినీడలు? హోలీ దాటినా డీఏ లేదు.. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ మొదటి వారం పూర్తయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (కరవు భత్యం), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్)పై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను ఇస్తుంది. ఇది బేసిక్ పే ఆధారంగా లెక్కించబడుతుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు.. మొదటి అర్ధభాగంలో హోలీ సమయానికి, రెండో అర్ధభాగంలో దీపావళి సమయంలో.. ఈ పెంపులను ప్రకటించడం ఆనవాయితీ. ఎప్పుడు ప్రకటించినా.. బకాయిలతో కలిపి జనవరి 1, జులై 1 నుంచే చెల్లిస్తుంటుంది.
వివరాలు
2016 తర్వాత ఇంత ఆలస్యం ఇదే తొలిసారి
ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.హోలీ సమయంలో రావాల్సిన డీఏ ప్రకటన ఆలస్యమవుతోంది.
మార్చి 4న హోలీ పూర్తయి నెల గడిచినా ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచింది.
ఏప్రిల్ మొదటి వారంలోనైనా ప్రకటన ఉంటుందని ఆశించినా అది కూడా జరగలేదు.
దీంతో డీఏ పెంపు ఉంటుందా? ఉంటే ఎప్పుడు? లేక ఆలస్యం కొనసాగుతుందా?అన్న సందేహాలు నెలకొన్నాయి.
7వ వేతన సంఘం అమలులోకి వచ్చిన 2016 తర్వాత ఇంత ఆలస్యం ఇదే తొలిసారి.
గత ఏడాది మార్చి 28న, 2024లో ఏప్రిల్ 3న డీఏ పెంపు ప్రకటించారు. అయితే COVID-19 సమయంలో మాత్రం 2019 అక్టోబర్ నుంచి 2021 జూలై వరకు దాదాపు 17-18 నెలలు డీఏను 17 శాతంపైనే నిలిపివేశారు.
వివరాలు
ICPI-IW సూచిక ఆధారంగా డీఏ పెంపు నిర్ణయం
ఆ సమయంలో పెంచాల్సిన మూడు విడతల బకాయిలు ఇప్పటికీ ఇవ్వలేదు.
ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతలు నేపథ్యంలో డీఏపై ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
గత పదేళ్ల రికార్డులు చూస్తే ఏప్రిల్‌లో డీఏ పెంపు చాలా అరుదుగా ప్రకటించారు.
సాధారణంగా తొలి అర్ధభాగంలోనే నిర్ణయం తీసుకుంటారు.
ఈసారి కూడా మొదటి వారంలో వస్తుందని భావించినా అది జరగలేదు. డీఏ పెంపు నిర్ణయం AICPI-IW సూచిక ఆధారంగా తీసుకుంటారు.
వివరాలు
2% డీఏ పెంపు సాధ్యమా?
ప్రస్తుత లెక్కల ప్రకారం డీఏ 58 శాతం నుంచి 2 శాతం పెరిగి 60 శాతానికి చేరే అవకాశముంది.
అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం పశ్చిమాసియా పరిస్థితులు, అలాగే త్వరలో 8వ వేతన సంఘం అమలు దశలో ఉండటంతో ఆలస్యం జరుగుతోంది.
ఈ ఏప్రిల్ రెండో వారంలో డీఏ పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.