Income Tax: మార్చి 31న డెడ్‌లైన్.. వెంటనే పూర్తి చేయాల్సిన ఆర్థిక పనులు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మార్చి 31 పన్ను చెల్లింపుదారులకు అత్యంత కీలకమైన గడువు. ఈ ఏడాది బడ్జెట్‌లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని, మీ పెట్టుబడులను ఒకసారి సమీక్షించడం అవసరం. ఈసారి ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఈ విధానంలో ఉద్యోగులకు రూ.12,75,000లోపు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ పరిధిలో ఉన్నవారు పన్ను ఆదా పథకాల కోసం ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. బదులుగా మంచి రాబడిని ఇచ్చే ఇతర పెట్టుబడులను ఎంపిక చేసుకోవచ్చు. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు కొన్ని కీలక అంశాలను తప్పనిసరిగా గమనించాలి.
Details
సెక్షన్ 80సీ పరిమితి
పాత విధానంలో ఉన్నవారు సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, సుకన్య సమృద్ధి, జీవిత బీమా ప్రీమియం వంటి పెట్టుబడులు ఇందులోకి వస్తాయి. ఇంకా ఈ పరిమితి వరకు పెట్టుబడి పెట్టకపోతే వెంటనే పూర్తి చేయాలి. కనీస డిపాజిట్ తప్పనిసరి పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి ఖాతాలున్నవారు ప్రతి ఏడాది కనీసం ఒకసారి డిపాజిట్ చేయాలి. లేకపోతే ఖాతా నిష్క్రియంగా మారుతుంది. తిరిగి యాక్టివ్ చేయాలంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Details
ఆరోగ్య బీమా ప్రయోజనం
మీరు, మీ కుటుంబ సభ్యుల కోసం తీసుకునే ఆరోగ్య బీమా ప్రీమియంపై సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు (సీనియర్ సిటిజన్లకు రూ.50,000 వరకు) పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల కోసం చెల్లించే ప్రీమియంపైనా అదనపు మినహాయింపులు పొందవచ్చు. దీర్ఘకాలిక మూలధన లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను ఉండదు. ఈ పరిమితిలో లాభాలు ఉంటే, మార్చి 31కి ముందే వాటిని విక్రయించి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఇందుకు ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. పాత పన్ను విధానంలో కొనసాగుతున్నవారు తమ పెట్టుబడి వివరాలను తమ కార్యాలయానికి వెంటనే సమర్పించాలి.