LOADING...
Delivery workers strike: దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల నిరసన.. స్విగ్గీ,జొమాటో, అమెజాన్‌ సేవలకు ఆటంకం
స్విగ్గీ,జొమాటో, అమెజాన్‌ సేవలకు ఆటంకం

Delivery workers strike: దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల నిరసన.. స్విగ్గీ,జొమాటో, అమెజాన్‌ సేవలకు ఆటంకం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో పనిచేస్తున్న గిగ్‌ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. వేతనాల పెంపు, పని పరిస్థితుల మెరుగుదల, ఉద్యోగ భద్రతతో పాటు సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్లతో వారు ఆందోళన చేపట్టారు. డిసెంబర్‌ 25, డిసెంబర్‌ 31 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం స్విగ్గీ,జొమాటో,అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ సంస్థల సేవలపై పడుతోంది. ఈ సమ్మెకు ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (IFAT), తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చాయి. ఫుడ్‌ డెలివరీ,క్విక్‌కామర్స్‌,ఈ-కామర్స్‌ విభాగాల్లో పనిచేస్తున్న స్విగ్గీ, జొమాటో,ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థల వర్కర్లు ఈ సమ్మెలో తప్పకుండా పాల్గొనాలని యూనియన్లు కోరాయి.

వివరాలు 

న్యాయం,గౌరవం,జవాబుదారీతనం కోసం ఈ సమ్మె

గిగ్‌ వర్కర్ల పరిస్థితి రోజురోజుకీ మరింత కష్టంగా మారుతోందని తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వ్యవస్థాపకుడు షేక్‌ సలావుద్దీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వర్కర్లఆదాయం తగ్గిపోతుండగా,వారికి ఎలాంటి సామాజికభద్రత లేదని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయం,గౌరవం,జవాబుదారీతనం కోసం ఈ సమ్మె చేపట్టినట్లు చెప్పారు. గిగ్‌ వర్కర్ల కష్టాన్ని ఆధారంగా చేసుకుని కంపెనీలు భారీ లాభాలు పొందుతున్నప్పటికీ,ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు. ఈఅంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు.అలాగే 10నిమిషాల్లో డెలివరీ చేసే మోడల్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గిగ్‌ వర్కర్లు కోరుతున్నారు. ఇదిలా ఉండగా,గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం ఇటీవల కొత్త లేబర్‌ కోడ్‌లలో కొన్ని కీలక నిబంధనలు చేర్చిన సమయంలోనే ఈ సమ్మె జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

కొత్త లేబర్‌ కోడ్‌ నిబంధనలను అమలు చేస్తామని స్విగ్గీ, జొమాటో సంస్థలు ప్రకటన 

ఆ నిబంధనల ప్రకారం అగ్రిగేటర్‌ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం వరకు,లేదా కార్మికులకు చెల్లించే మొత్తంలో 5 శాతం వరకు సామాజిక భద్రతా నిధికి కేటాయించాల్సి ఉంటుంది. అదనంగా గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య,ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కొత్త లేబర్‌ కోడ్‌ నిబంధనలను అమలు చేస్తామని స్విగ్గీ, జొమాటో సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. దీనివల్ల తమ వ్యాపారానికి గానీ, ఆర్థిక పరిస్థితికి గానీ పెద్దగా ప్రభావం ఉండబోదని అవి స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల మధ్య గిగ్‌ వర్కర్లు అనేక డిమాండ్లతో సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement