DGCA: విమాన టికెట్ల రిఫండ్ నిబంధనల్లో డీజీసీఏ మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
విమాన టికెట్ల రద్దు, రిఫండ్ నిబంధనల విషయంలో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సవరించింది. టికెట్ బుక్ చేసిన తర్వాత 48 గంటల లోపే రద్దు చేసుకుంటే ప్రయాణికులపై ఎటువంటి అదనపు ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో టికెట్‌లో మార్పులు కూడా ఉచితంగానే చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా పేర్కొంది. అయితే ఈ సౌకర్యాలకు కొన్ని నిర్దిష్ట షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. టికెట్ బుకింగ్ చేసిన వెంటనే 48 గంటల పాటు 'లుక్-ఇన్ ఆప్షన్'ను విమానయాన సంస్థలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
వివరాలు
మార్పు చేసిన కొత్త తేదీలో టికెట్ ధర పెరిగితే.. , తేడా మొత్తాన్ని ప్రయాణికులే చెల్లించాలి
ఈ వ్యవధిలో ప్రయాణికులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా టికెట్‌ను రద్దు చేయడం లేదా తేదీ, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు. అయితే మార్పు చేసిన కొత్త తేదీలో టికెట్ ధర పెరిగి ఉంటే, తేడా మొత్తాన్ని మాత్రం ప్రయాణికులే చెల్లించాలి. ట్రావెల్ ఏజెంట్లు లేదా వారి ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినా, రిఫండ్ చెల్లించే బాధ్యత పూర్తిగా విమానయాన సంస్థలదేనని డీజీసీఏ స్పష్టం చేసింది. రద్దు చేసిన తర్వాత 14 పని దినాల లోపే రిఫండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
7 రోజుల ముందు బుక్ చేసిన టికెట్లకు 'లుక్-ఇన్ ఆప్షన్' వర్తించదు
అలాగే ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసిన ప్రయాణికులు,బుకింగ్ చేసిన 24 గంటలలోపే పేరులో పొరపాట్లు ఉంటే సవరించుకోవచ్చు. ఈ మార్పుల కోసం సంస్థలు అదనపు ఫీజులు వసూలు చేయరాదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దేశీయ విమానాల విషయంలో, ప్రయాణ తేదీకి కేవలం 7 రోజుల ముందు బుక్ చేసిన టికెట్లకు 'లుక్-ఇన్ ఆప్షన్' వర్తించదు. అంతర్జాతీయ విమానాల సందర్భంలో ఈ గడువు 15 రోజులు గా నిర్ణయించారు. మెడికల్ ఎమర్జెన్సీలకు సంబంధించి కూడా డీజీసీఏ కొత్త మార్పులు చేసింది.
వివరాలు
ఈ సందర్భాల్లో విమానయాన సంస్థ రిఫండ్ జారీ
ప్రయాణికుడు లేదా అదే పీఎన్‌ఆర్‌లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రయాణ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే, రిఫండ్ లేదా క్రెడిట్ షెల్ ఎంపికను కోరే అవకాశం ఉంటుంది. ఇతర అనారోగ్య పరిస్థితులు లేదా అత్యవసర సందర్భాల్లో, ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఏరోస్పేస్ మెడిసిన్ నిపుణుడు లేదా డీజీసీఏ గుర్తింపు పొందిన ఏరోస్పేస్ మెడిసిన్ నిపుణుడి సిఫారసు ఆధారంగా సంబంధిత విమానయాన సంస్థ రిఫండ్ జారీ చేయవచ్చని స్పష్టం చేసింది.