Loading...
NEET UG 2026 Counselling: నీట్‌ యూజీ 2026: సీట్ల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను సులభతరం చేసిన ఎంసీసీ
నీట్‌ యూజీ 2026: సీట్ల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను సులభతరం చేసిన ఎంసీసీ

NEET UG 2026 Counselling: నీట్‌ యూజీ 2026: సీట్ల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను సులభతరం చేసిన ఎంసీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ యూజీ-2026 కౌన్సెలింగ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) పలు కీలక మార్పులు ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు తదుపరి రౌండ్‌లో మెరుగైన సీటు కోసం అప్‌గ్రేడేషన్‌ ఎంపిక చేసుకుంటే,ముందుగా కేటాయించిన వైద్య కళాశాలకు వెళ్లి భౌతికంగా రిపోర్టు చేయాల్సిన అవసరం ఉండదు. ఇకపై అభ్యర్థులు తమకు కేటాయించిన సీటును ఆన్‌లైన్‌లోనే అంగీకరిస్తూ,కళాశాలకు హాజరుకాకుండానే తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌లో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థులకు సమయం,ప్రయాణ వ్యయం రెండూ ఆదా కానున్నాయి. అలాగే,ఇప్పటికే కేటాయించిన సీటును వదులుకోవాలనుకునే అభ్యర్థులకు కూడా ఎంసీసీ వెసులుబాటు కల్పించింది.

వివరాలు 

కౌన్సెలింగ్‌ పోర్టల్‌లోనే ఆన్‌లైన్‌ ద్వారా రిజిగ్నేషన్‌ చేసే అవకాశం

ఇందుకోసం సంబంధిత కళాశాలకు వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేకుండా, కౌన్సెలింగ్‌ పోర్టల్‌లోనే ఆన్‌లైన్‌ ద్వారా రిజిగ్నేషన్‌ చేసే అవకాశం కల్పించింది.

డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది.

ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర వైద్య విద్యాధికారులు, కౌన్సెలింగ్‌ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు కొత్త నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది.

వివరాలు 

కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పారదర్శకత

అదేవిధంగా ప్రతి వైద్య కళాశాలలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, కోర్సుల ఫీజుల వివరాలను విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది.

కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ADVERTISEMENT