PAN Card: మీ పాన్ కార్డ్ నంబర్ లో జనరేట్ అయ్యే అక్షరాలకు అర్థం ఏంటీ..? ఈ కోడ్ అర్థాలు చూద్దాం
అర్థిక లావాదేవీలు జరిపే ప్రతి భారతీయుడికి పాన్ కార్డు (PAN card) అవసరం. పాన్ ద్వారా ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తాయి. ఒకరికి ఎంత ఆదాయం వస్తుందనేదానిపై ఆధారపడి పన్నులు విధిస్తారు. పాన్‌ని ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా ఉపయోగిస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుండి ఇన్వెస్ట్‌మెంట్స్ వరకు, ప్రతి అంశానికి పాన్ అవసరం. ఈ డాక్యుమెంట్‌లో కార్డు హోల్డర్ పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారముంటుంది. పాన్ అనేది 10 అంకెల ఆల్ఫాన్యూమరికల్ నంబర్, ఇది ఒక సీక్రెట్ కోడ్‌లా ఉంటుంది.
పాన్ కార్డు అప్లికేషన్ కోడ్
పాన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వ్యక్తులు ఇచ్చే వివరాల ఆధారంగా ఈ నంబర్‌ను జనరేట్ చేస్తారు. ఇందులో ఇంగ్లీష్ కోడ్స్, నంబర్స్ ఒక క్రమంలో ఉంటాయి. ఉదాహరణకు AAA PL 1234 C. 3 అక్షరాలు ఇందులోని మొదటి మూడు అక్షరాలు A నుండి Z వరకు ఇంగ్లీష్ లెటర్లలో ఉంటాయి. ప్రస్తుతం ఏ సిరీస్‌లో పాన్ కార్డులు జారీ అవుతున్నాయో, దాని ఆధారంగా ఈ అక్షరాలు మారుతాయి.
వ్యక్తులను బట్టి కోడ్ లెటర్
ఏ రకమైన పన్ను చెల్లింపుదారు అనేది నాలుగవ అక్షరం చూపిస్తుంది. ఉదాహరణకు, నాలుగవ అక్షరం 'C' అయితే, అది కంపెనీని సూచిస్తుంది. 'P' అయితే, కార్డు ఒక వ్యక్తిది అని అర్థం. వివరంగా చూస్తే: P - వ్యక్తి (Individual), F - సంస్థ (Firm), C - కంపెనీ (Company), A - అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (AOP), T - ట్రస్ట్ (Trust), H - హిందూ అవిభక్త కుటుంబం (HUF), B - బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (BOI), L - లోకల్ (Local), J - ఆర్టిఫిషియల్ జ్యూడిషల్ పర్సన్ (Artificial Judicial Person), G - గవర్నమెంట్ (Government)
ప్రతి అక్షరానికి అర్థం ఇదే
"గవర్నమెంట్" అంటే దేశాన్ని నడిపించే వివిధ శాఖలు లేదా ఆఫీస్‌లు, ఉదాహరణకు పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, విద్య శాఖ వంటివి. "బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్" అంటే కొంతమంది కలిసి ఏదో ఒక పని చేయడానికి ఏర్పాటు చేసుకున్న గ్రూప్, ఉదాహరణకు స్కూల్‌లోని విద్యార్థి సంఘం, గ్రామంలోని రైతు సంఘం వంటివి. వీరు అధికారికంగా కంపెనీలుగా నమోదు కాకపోయినా, కలిసి పని చేస్తారు. పాన్ కార్డులో "లోకల్" అంటే స్థానిక ప్రాంతాన్ని పరిపాలించే సంస్థ, ఉదాహరణకు పట్టణం లేదా గ్రామాన్ని పరిపాలించే మునిసిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ వంటివి.
ఐటీ నిర్ణయిస్తే అక్షరాలు
ఐదవ అక్షరం కార్డు హోల్డర్ ఇంటిపేరు మొదటి అక్షరం అవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంటిపేరు బచ్చన్ అయితే ఐదవ అక్షరం 'B' అవుతుంది. మిగతా అక్షరాలు, సంఖ్యలను ఆదాయపు పన్ను శాఖ నిర్ణయిస్తుంది. ఈ తర్వాత పాన్ కార్డులో నాలుగు నంబర్లు ఉంటాయి. అవి 0001 నుంచి 9999 వరకూ ఏ నంబర్ అయినా ఉండవచ్చు.
చివరి అక్షరం చెక్ డిజిట్
పాన్ కార్డులోని చివరగా ఒక ఇంగ్లీష్ లెటర్ ఉంటుంది, ఇది A నుండి Z వరకు ఏదైనా ఉండవచ్చు. దీనిని చెక్ డిజిట్ అంటారు. PAN కచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈ చెక్ డిజిట్ ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రత్యేక అల్గారిథమ్ ద్వారా జనరేట్ అవుతుంది. ఇది పాన్ యూనిక్,వ్యాలీడ్ అని నిర్ధారించే అక్షరం, ఎర్రర్స్, ఫ్రాడ్స్‌కు చెక్ పెట్టే సేఫ్టీ ఫీచర్‌గా పనిచేస్తుంది. పాన్ కార్డుల రకాలు భారతదేశం నివాసి అయితే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫారం 49A సమర్పించాలి. విదేశీ పౌరులు, ఇతర దేశాలకు చెందిన వారు ఫారం 49AAతో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీల కోసం ప్రత్యేకంగా బిజినెస్ పాన్ కార్డులు ఉంటాయి.