ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల బెంగళూరులో ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆస్తులపై విచారణ చేపట్టింది. రవీంద్రన్ ఇల్లుతో పాటు కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం బైజు రవీంద్రన్, అతని కంపెనీ 'థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'పై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈడీ విచారణ చేపట్టింది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో కంపెనీ రూ. 28,000 కోట్ల మేర ఎఫ్‌డీఐ పెట్టుబడులను పొందినట్లు సోదాల్లో వెల్లడైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో రూ. 9,754 కోట్లను విదేశీ సంస్థల్లోకి బదిలీ చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది.
ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయని ఈడీ
ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో కంపెనీ దాదాపు రూ. 944 కోట్లను ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది. అంతేకాకుండా 2021ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయలేదని ఈడీ ఆరోపించింది. ఖాతాలను ఆడిట్ చేయలేదని అధికారులు తెలిపారు. సంస్థ అందించిన లెక్కల వాస్తవికతను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి బ్యాంకులతో కలిసి లెక్కిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే ఈడీ విచారణపై బైజుస్ లీగల్ టీమ్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేసారు. ఫెమా నిబంధనల ప్రకారం ఇది సాధారణ విచారణగా చెప్పారు. తాము పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. అధికారులు అడిగి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు.