RBI New ATM Rules: ఏటీఎం వాడుతున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినళ్ల ద్వారా నగదు ఉపసంహరణలకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 ఉత్తర్వులను రద్దు చేస్తూ.. నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలన్నింటినీ ఒకే మార్గదర్శకంలోకి తీసుకొచ్చింది. ఖాతాదారులు నెలలో వినియోగించుకున్న ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్య, పరిమితి దాటితే విధించే ఛార్జీల వివరాలను ఎప్పటికప్పుడు అలర్టుల రూపంలో తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే ఏటీఎంలు మెట్రో నగరాల్లో ఉన్నాయా? నాన్-మెట్రో ప్రాంతాల్లో ఉన్నాయా? అనే విషయాన్ని స్పష్టంగా తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది.
వివరాలు
ఉచిత లావాదేవీల పరిమితుల్లో మార్పు లేదు
తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ నూతన మార్గదర్శకాలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు వర్తిస్తాయి. అయితే ఉచిత లావాదేవీల పరిమితుల్లో మాత్రం ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదు.
పొదుపు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) చేసుకోవచ్చు.
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3, నాన్-మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది.
ఈ పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23తో పాటు వర్తించే పన్నులను మాత్రమే ఛార్జీగా వసూలు చేయాలి.
వివరాలు
విఫలమైన లావాదేవీలపై ఛార్జీలు వద్దు
ఏటీఎంలలో గరిష్ఠ నగదు ఉపసంహరణ పరిమితులు, ఉచిత లావాదేవీలు, ఛార్జీల వివరాలను ఇంగ్లిష్, హిందీతో పాటు స్థానిక భాషలోనూ ప్రదర్శించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
సాంకేతిక లోపాలు, హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు, సర్వర్ వైఫల్యాలు, ఏటీఎంలో నగదు కొరత కారణంగా విఫలమయ్యే లావాదేవీలను ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించకూడదని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది.
ఇలాంటి లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని స్పష్టం చేసింది. బ్యాంకు లేదా సర్వీస్ ప్రొవైడర్ తప్పిదాల వల్ల లావాదేవీ తిరస్కరణకు గురైనా.. ఆ భారాన్ని ఖాతాదారులపై వేయకూడదని సూచించింది.
వివరాలు
పీఓఎస్ టెర్మినళ్ల వద్దా నగదు తీసుకోవచ్చు
మరోవైపు వ్యాపార సంస్థల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినళ్ల ద్వారా డెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ ప్రీపెయిడ్ కార్డులు, యూపీఐ ఉపయోగించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది.
పీఓఎస్ టెర్మినల్ వద్ద ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.2,000, నెలకు మొత్తం రూ.10,000 వరకు నగదు తీసుకోవచ్చు. దీనిపై ఛార్జీలు విధించినా.. ఆ మొత్తం లావాదేవీ విలువలో 1 శాతానికి మించకూడదు.
ఎలాంటి కొనుగోళ్లు చేయకపోయినా పీఓఎస్ టెర్మినల్ ద్వారా నగదు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ వస్తువుల కొనుగోలుతో పాటు నగదు తీసుకుంటే.. ఆ మొత్తాన్ని రశీదులో ప్రత్యేకంగా చూపించాలని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది.